ఆ ఎస్సై సన్నబడ్డాడోచ్‌.. !

825
Obese police daulat ram loses 65 kg

మధ్యప్రదేశ్‌కు చెందిన పోలీసు ఇన్‌స్పెక్టర్‌ దౌలత్‌రామ్‌ జోగావత్‌ గుర్తున్నారా? ఆ మధ్య ప్రముఖ రచయిత్రి-కాలమిస్ట్‌ శోభా డే ఆయనను ‘బాడీషేమింగ్‌’ (లావుగా ఉన్నాడని ఎద్దేవా చేస్తూ) పెట్టిన ఓ ట్వీట్‌ వైరల్‌ అయింది. దీంతో పాపులర్‌ అయిన ఎస్సై దౌలత్‌రామ్‌ ఇప్పుడు బరువు తగ్గాడు. గతంలో 180 కిలోల భారీకాయంతో అతను పోలీసు ఉద్యోగం చేసేవాడు. తాజాగా శస్త్రచికిత్స చేయించుకొని ఏకంగా 60 కిలోల బరువు తగ్గాడు. ప్రముఖ బరియాట్రిక్‌ సర్జన్‌ డాక్టర్‌ ముఫజల్‌ లక్డవాలా ఆయనకు సైఫీ ఆస్పత్రిలో విజయవంతంగా శస్త్రిచికిత్స చేశారు.



గత ఏడాది ఫిబ్రవరిలో శోభా డే ‘ముంబైలో పోలీసు బందోబస్తు హెవీగా ఉందంటూ’ భారీకాయంతో లావుగా ఉన్న దౌలత్‌రామ్‌ జోగావత్‌ ఫొటోను ట్వీట్‌ చేశారు. ఈ ట్వీట్‌ తీవ్ర వివాదాన్నే రేపింది. స్థూలకాయులను కించపరిచేలా ఆమె ట్వీట్‌ ఉందని విమర్శలు వెల్లువెత్తాయి. చివరకు ముంబై పోలీసులు కూడా స్పందించారు. శోభో డే పరిహాసం గతి తప్పిందని, ఆమె ట్వీట్‌ చేసిన ఫొటో ముంబై పోలీసులది కాదని, బాధ్యతయుతమైన ఆమెలాంటి పౌరుల నుంచి ఇలాంటివి ఆశించడం లేదని ముంబై పోలీసులు చురకలు అంటించారు.

నిజానికి శోభా డే చేసిన ట్వీట్‌ మీద దౌలత్‌రామ్‌కు కోపమేమీ రాలేదట. ఆమె ట్వీట్‌ చేయడం వల్లే ఆయన బరువు తగ్గాలని నిర్ణయించుకున్నాడని, అందువల్ల ఆమెకు వ్యక్తిగతంగా కృతజ్ఞతలు చెప్పాలనుకుంటున్నాడని స్థానికంగా కథనాలు కూడా వస్తున్నాయి. దౌలత్‌రామ్‌ 1979లో కానిస్టేబుల్‌గా పోలీసుశాఖలో చేరాడు. తాజా పరిణామంపై శోభా డే ట్వీట్‌ చేశారు. ‘ఇది సుఖాంతమవ్వడం ఆనందంగా ఉంది. దౌలత్‌రామ్‌ భగవంతుడి ఆశీస్సులతో ఆయురారోగ్యాలతో జీవించాలి’ అని ట్వీట్‌ చేశారు.