కొలువుదీరిన కొత్త మంత్రులు

365
New Ministers in Telangana

రాష్ట్ర మంత్రివర్గంలో సభ్యుల సంఖ్య 12కు చేరింది. క్యాబినెట్‌ను విస్తరించాలన్న ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు నిర్ణయం మేరకు మంగళవారం మాఘ శుద్ధ పౌర్ణమి ఉదయం 11.30 గంటలకు రాజ్‌భవన్‌లో గవర్నర్ నరసింహన్ పదిమందితో మంత్రులుగా ప్రమాణం చేయించారు. మొదట అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి ప్రమాణం స్వీకరించగా.. తర్వాత తలసాని శ్రీనివాస్‌యాదవ్, జీ జగదీశ్‌రెడ్డి, ఈటల రాజేందర్, సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, కొప్పుల ఈశ్వర్, ఎర్రబెల్లి దయాకర్‌రావు, వీ శ్రీనివాస్‌గౌడ్, వేముల ప్రశాంత్‌రెడ్డి, సీహెచ్ మల్లారెడ్డి వరుసగా ప్రమాణం చేశారు. జగదీశ్‌రెడ్డి, ఈటల రాజేందర్ పవిత్ర హృదయంతో, మిగిలిన సభ్యులు దైవ సాక్షిగా ప్రమాణంచేశారు. ప్రమాణం అనంతరం కొత్త మంత్రులు గవర్నర్ నరసింహన్, సీఎం కేసీఆర్ ఆశీస్సులు తీసుకున్నారు. కార్యక్రమం అనంతరం గవర్నర్ నరసింహన్, సీఎం కేసీఆర్ మంత్రులతో కలిసి గ్రూప్ ఫొటో దిగారు. కొత్తగా చేరిన మంత్రులకు సీఎం శాఖలు కేటాయించారు. సీఎం ఆదేశాల మేరకు కొత్త మంత్రులకు శాఖలు కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి ఉత్తర్వులు జారీచేశారు.




కొత్త మంత్రులకు అభినందనల వెల్లువ

ప్రమాణ స్వీకారం ముగిసిన తరువాత ముఖ్యమంత్రి కేసీఆర్ కొత్త మంత్రులను అభినందించారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కొత్త మంత్రులకు శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమం అనంతరం అతిథులకు రాజ్‌భవన్‌లో తేనీటి విందు ఇచ్చారు. కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారోత్సవానికి మండలి చైర్మన్ స్వామిగౌడ్, స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి, హోం మంత్రి మహమూద్ అలీ, టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు, టీఆర్‌ఎస్ సెక్రటరీ జనరల్, రాజ్యసభ సభ్యుడు కే కేశవరావు, లోక్‌సభలో టీఆర్‌ఎస్ పక్ష నేత ఏపీ జితేందర్‌రెడ్డి, ఎంపీలు సీతారాంనాయక్, జోగినిపల్లి సంతోష్‌కుమార్, బండ ప్రకాశ్, బూర నర్సయ్యగౌడ్, కొత్త ప్రభాకర్‌రెడ్డి, అసెంబ్లీ మాజీ స్పీకర్లు సురేశ్‌రెడ్డి, మధుసూదనాచారి, మాజీ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, ప్రభుత్వ సలహాదారు వివేక్ వెంకటస్వామి, ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధి వేణుగోపాలాచారి, మాజీ మంత్రులు హరీశ్‌రావు, నాయిని నర్సింహారెడ్డి, జోగు రామన్న, సీహెచ్ లక్ష్మారెడ్డి, పద్మారావుగౌడ్, మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, సమాచార హక్కు చట్టం చైర్మన్, కమిషనర్లు, పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్, సభ్యులు, బీసీ కమిషన్ చైర్మన్, సభ్యులతోపాటు వివిధ ఉద్యోగ సంఘాల నాయకులు తదితరులు హాజరయ్యారు. మంత్రుల ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఎస్కే జోషి, గవర్నర్ ముఖ్య కార్యదర్శి హర్‌ప్రీత్‌సింగ్, జీఏడీ ముఖ్య కార్యదర్శి అధర్‌సిన్హా, అసెంబ్లీ కార్యదర్శి నరసింహాచార్యులు, ప్రభుత్వ ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శులు, సీనియర్ అధికారులు పాల్గొన్నారు.

కోలాహలంగా రాజ్‌భవన్ పరిసరాలు

కొత్త మంత్రుల ప్రమాణస్వీకారోత్సవానికి వచ్చినవారితో రాజ్‌భవన్ పరిసరాలు కోలాహలంగా మారాయి. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర రాజకీయ నాయకులు, మంత్రులుగా ప్రమాణం స్వీకరించేవారి కుటుంబసభ్యులతో రాజ్‌భవన్ కిక్కిరిసింది. రాజ్‌భవన్ పరిసరాల్లో భారీ ఎత్తున వాహనాల రాకపోకలుండటంతో ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయే పరిస్థితి నెలకొన్నది. ఒకదశలో కొత్తగా మంత్రులైనవారు కూడా రాజ్‌భవన్‌కు చేరుకోవడం ఒకింత ఇబ్బందేమోన్న సందేహం కలిగింది. అయితే, పరిస్థితిని గమనించిన పోలీసు సిబ్బంది, అధికారులు సాధారణ ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు. కొత్త మంత్రులతో సెల్ఫీలు దిగేందుకు పలువురు పోటీలు పడ్డారు.

మంత్రులకు శాఖల కేటాయింపు

కొత్త మంత్రులకు సీఎం కేసీఆర్ శాఖలను కేటాయించారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేర కు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి మంగళవారం సాయంత్రం మంత్రులకు శాఖలు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీచేశారు. గత మంత్రివర్గంలో ఆర్థికమంత్రిగా పనిచేసిన ఈటల రాజేందర్‌కు ఈసారి వైద్య, ఆరోగ్య శాఖ అప్పగించారు. గత ప్రభుత్వంలో కొంతకాలం విద్యాశాఖ మంత్రిగా, ఆ తరువాత విద్యుత్‌శాఖ మంత్రిగా పనిచేసిన జగదీశ్‌రెడ్డికి తిరిగి విద్యాశాఖ కేటాయించారు. ఇంద్రకరణ్‌రెడ్డికి గతంలో ఉన్న దేవాదాయ, ధర్మాదాయ, న్యాయశాఖలతోపాటు అదనంగా అటవీ, పర్యావరణ శాఖలు అప్పగించారు. మంత్రులకు కేటాయించని ఆర్థిక, పురపాలక, సాగునీటిపారుదల, ఇంధన, రెవెన్యూ, ఐటీ, పరిశ్రమలతోపాటు ఇతర శాఖలు సీఎం కేసీఆర్ వద్దనే ఉన్నాయి. లోక్‌సభ ఎన్నికల తరువాత జరిగే మంత్రివర్గ విస్తరణలో మిగిలిన శాఖలను కొత్త మంత్రులకు కేటాయించనున్నారు.



రేపు క్యాబినెట్ సమావేశం

రాష్ట్ర మంత్రివర్గ తొలి సమావేశం గురువారం నిర్వహించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ప్రగతిభవన్‌లో గురువారం సాయంత్రం నాలుగు గంటలకు సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరిగే మంత్రివర్గ సమావేశంలో రాష్ట్ర బడ్జెట్‌కు ఆమోదం తెలియజేస్తారు. ఈ మేరకు మంత్రులకు సాధారణ పరిపాలనశాఖ సమాచారం అందించింది. సమావేశానికి ఎజెండాను కూడా జీఏడీ రూపొందించనున్నది.

అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి: దేవాదాయ-ధర్మాదాయ, అటవీ-పర్యావరణ, శాస్త్ర-సాంకేతిక, న్యాయశాఖలు

ఈటల రాజేందర్: వైద్య, ఆరోగ్యం, కుటుంబ సంక్షేమశాఖలు

జీ జగదీశ్‌రెడ్డి: విద్యాశాఖ

వేముల ప్రశాంత్‌రెడ్డి: శాసనసభ వ్యవహారాలు, రోడ్లు-భవనాలు, రవాణా, గృహనిర్మాణం

ఎర్రబెల్లి దయాకర్‌రావు:పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా

తలసాని శ్రీనివాస్‌యాదవ్: పశు సంవర్ధకశాఖ, మత్స్య, డెయిరీ డెవలప్‌మెంట్, సినిమాటోగ్రఫీ

వీ శ్రీనివాస్‌గౌడ్: ఎక్సైజ్, క్రీడలు-యువజన సర్వీసులు, టూరిజం-సంస్కృతి, ఆర్కియాలజీ శాఖలు

కొప్పుల ఈశ్వర్: ఎస్సీ డెవలప్‌మెంట్, గిరిజన, బీసీ, మైనార్టీ, దివ్యాంగులు, సీనియర్ సిటిజన్ల సంక్షేమశాఖలు

సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి: వ్యవసాయం, సహకారం, మార్కెటింగ్, పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాలు

చామకూర మల్లారెడ్డి: కార్మిక, ఉపాధి కల్పన, ఫ్యాక్టరీలు, మహిళాశిశు సంక్షేమం, స్కిల్ డెవలప్‌మెంట్