కేంద్రం ఇటీవల తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దేశ రాజధాని ఢిల్లీ సరిహద్దులో దాదాపు 72 రోజులుగా ఆందోళన చేస్తున్న రైతులు నేడు చక్కా జామ్ కార్యక్రమం నిర్వహైంచనున్నారు.
ఈ నేపథ్యంలో పోలీసులు ఢిల్లీలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా మధ్యాహ్నం 12 గంటల నుంచి మూడు గంటల వరకు రోడ్లను దిగ్బంధించనున్నారు.
ఈ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా 40 వేలమంది పోలీసు, కేంద్ర పారామిలటరీ బలగాలను మోహరించారు. ఢిల్లీ సరిహద్దుల్లో కేంద్ర సైనిక బలగాలతో పహరా ఏర్పాటు చేశారు.
తాము జాతీయ రహదారులు, రాష్ట్ర హైవేలను మాత్రమే దిగ్బంధిస్తామని, స్కూలు బస్సులు, అంబులెన్స్‌లు, ఇతర అత్యవసర వాహనాలను అడ్డుకోబోమని 41 యూనియన్ల రైతు సమైక్య వేదిక సంయుక్త కిసాన్ మోర్చా తెలిపింది.
రైతుల ఆందోళన నేపథ్యంలో ఢిల్లీలోని మెట్రో రైల్వేస్టేషన్లపై పోలీసులు నిఘా ఉంచారు. ఎర్రకోట వద్ద భారీఎత్తున పోలీసులతో భద్రతా ఏర్పాట్లు చేశారు.ఘాజీపూర్ సరిహద్దు వద్ద చక్కా జామ్ సందర్భంగా పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేశారు.