నల్గొండ జిల్లాలోని పలు గ్రామీణ ప్రాంతాలలో కొంతమంది ఆర్.ఎం.పి.లు లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తున్నారని, అర్హత లేకున్నా ఆసుపత్రులు ఏర్పాటు చేసి సర్జరీలు, మెడికల్ షాపులను నిర్వహిస్తున్నారని అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని డిఐజి ఏ.వి. రంగనాధ్ తెలిపారు.
సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఆర్.ఎం.పి.లు, వైద్య ఆరోగ్య శాఖ, పోలీస్ అధికారులు, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహించడం చట్ట విరుద్ధమని తెలిసినప్పటికి కొందరు ఆర్.ఎం.పి.లు అక్రమంగా ఇలాంటి పరీక్షలు నిర్వహిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇప్పటికే జిల్లాలో స్త్రీ, పురుషుల నిష్పత్తిలో చాలా వ్యత్యాసం ఉన్నదని, పలు గ్రామీణ ప్రాంతాలలో లింగ నిర్ధారణ పరీక్షలు చేయించుకుంటూ ఆడపిల్ల పుడుతుందని తెలియగానే అబార్షన్లు చేయించుకుంటున్నారని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా పలువురు ఆర్.ఎం.పి.లు చట్టాలను ఉల్లంఘిస్తూ లింగ నిర్ధారణ పరీక్షలు చేయడమే కాకుండా ఆబార్షన్లు సైతం చేస్తూ అడపిల్ల పుట్టకుండా చేస్తున్నారని, ఇది చాలా దారుణమన్నారు.
జిల్లాలో కొంతమంది లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నట్లుగా తమ దృష్టికి వచ్చిన విషయాన్ని సమగ్రంగా విచారణ చేస్తున్నామని త్వరలోనే జిల్లా కలెక్టర్ దృష్టికి విషయాన్ని తీసుకువెళ్లి వైద్య ఆరోగ్య శాఖ, పోలీస్ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో కార్యాచరణ రూపొందించి లింగ నిర్ధారణ పరీక్షలు ఎక్కడా జరపకుండా కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.
ఆర్.ఎం.పి. డాక్టర్లు ప్రాథమిక చికిత్స చేయడానికి మాత్రమే అర్హులని కానీ చాలా మంది ఏకంగా ఆసుపత్రులు ఏర్పాటు చేసి నిర్వహిస్తున్నారని అలాంటి వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. ఆర్.ఎం.పి.ల. పాత్ర, వారు చేయాల్సిన విధుల పట్ల ఆయన వారికి అవగాహన కల్పించారు. తప్పు చేస్తే ఎవరిని ఉపేక్షించేది లేదని, ఎం.బి.బి.ఎస్. చదివిన వైద్యులకు సైతం సర్జరీలు చేసే అర్హత లేదనే విషయాన్ని గుర్తించాలని ఆయన సూచించారు.
పలువురు ఆర్.ఎం.పి.లు తమ పేర్లకు ముందు డాక్టర్ అని రాసుకుంటున్నారని, ఆస్పత్రుల బోర్డులు పెట్టుకుంటున్నారని ఇది పూర్తిగా చట్ట విరుద్ధమని స్పష్టం చేశారు. త్వరలో జిల్లా వ్యాప్తంగా తనిఖీలు నిర్వహించి నిబంధనలు పాటించని వారిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు.
సమావేశంలో డీఎస్పీలు వెంకటేశ్వర్ రెడ్డి, ఆనంద్ రెడ్డి, వైద్య ఆరోగ్య శాఖ అధికారి కళ్యాణ్ రాజ్, ఐ.ఎం.ఏ. అధ్యక్షుడు డాక్టర్ పుల్లారావు, పలువురు పోలీస్ అధికారులు, ఆర్.ఎం.పి.ల సంఘం ప్రతినిధులు, జిల్లా వ్యాప్తంగా ఉన్న ఆర్.ఎం.పి.లు తదితరులు పాల్గొన్నారు.