వరంగల్ కలెక్టర్ ను అవమానించిన ఎమ్మెల్యే

550
mla donti madhava reddy used bad language on warangal collector

తెలంగాణలో ఎమ్మెల్యేలు రెచ్చిపోతున్నారు. నిన్నమొన్నటి వరకు అధికార పార్టీ ఎమ్మెల్యేలు నోటికి పని చెప్పి వివాదాల పాలయ్యారు. శంకర్ నాయక్, బొడిగె శోభ, రసమయి బాల కిషన్, పుట్టా మధు, ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, చింతా ప్రభాకర్, వేముల వీరేశం లాంటి ఎమ్మెల్యేలంతా తమ నోటి చలవతో తిట్ల దండకం ఎత్తుకుని విమర్శలపాలయ్యారు. కానీ ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో అధికార పార్టీ నేతలు ఒక్కొక్కరుగా నోరు మూస్తున్నారు. కానీ ఈ సమయంలో ప్రతిపక్ష ఎమ్మెల్యే ఒకరు ఏకంగా జిల్లా కలెక్టర్ గురించి అనుచితమైన కామెంట్స్ చేసి వివాదంలో చిక్కుకున్నారు. ఇంతకూ ఎవరా ఎమ్మెల్యే? ఏంటా వివాదం తెలియాలంటే చదవండి స్టోరీ.



 

వరంగల్ జాయింట్ కలెక్టర్ గా ఉన్న ఎం. హరిత ఇటీవల అదే జిల్లాకు కలెక్టర్ గా నియమితులయ్యారు. జాయింట్ కలెక్టర్ గా ఉన్న సమయంలోనూ ఆమె హార్డ్ వర్కర్ గా పేరు తెచ్చుకున్నారు. ఈ పరిస్థితుల్లో ఆమెకు అదే జిల్లాలో కలెక్టర్ గా బాధ్యతలు అప్పగించడంతో చురుకైన పాత్ర పోశిస్తున్నారు. అయితే నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి బుధవారం ప్రింట్ మీడియా రిపోర్టర్లతో ప్రెస్ మీట్ పెట్టారు. ఇండిపెండెంట్ గా గత ఎన్నికల్లో దొంతి నర్సంపేటలో గెలిచారు. అధికార టిఆర్ఎస్ లోకి రావాలంటూ ఎంత వత్తిడి చేసినా.. ఆయన కాంగ్రెస్ తో కలిసి పనిచేస్తున్నారు. కాంగ్రెస్ అనుబంధ సభ్యుడిగా కొనసాగుతున్నారు.

నిన్న జరిగిన మీడియా సమావేశంలో కలెక్టరమ్మను ఉద్దేశించి అనుచితమైన వ్యాఖ్యలు చేశారని ఉద్యోగ సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు. కలెక్టర్ ను ఉద్దేశించి ఆమె ‘‘ఎలోడు పని చేసినట్లు చేస్తుందిగా’’ అని కామెంట్ చేశారని ఉద్యోగ సంఘాల నేతలు ఫైర్ అవుతున్నారు. (ఎలోడు అనే పదం వెలివేయబడ్డ వాడు, దళితుడు అని అర్థం వచ్చేలా ఉత్తర తెలంగాణలో వాడుకలో ఉంది.)


అయితే ఎమ్మెల్యే దొంతి ప్రింట్ మీడియా రిపోర్టర్ల వద్ద ఈ కామెంట్ చేయడంతో ఆ మాటలు రికార్డు కాలేదని చెబుతున్నారు. అభివృద్ధి కార్యక్రమాల్లో కలెక్టర్ తనను పట్టించుకోవడంలేదన్న ఆవేదనతోనే ఎమ్మెల్యే ఇలా కామెంట్ చేసినట్లు చర్చ జరుగుతోంది. ఎమ్మెల్యే కామెంట్స్ పై వరంగల్ రూరల్ జిల్లాలో ఉద్యోగులు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. జిల్లా అంతటా నిరసనలకు దిగారు ఉద్యోగులు. కలెక్టర్ పై అనుచిత వాఖ్యలు చేసిన ఎమ్యెల్యే దొంతి మాధవరెడడ్ భేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నాయి జిల్లా ఉద్యోగ సంఘాలు.

ఎమ్మెల్యే కామెంట్స్ కు నిరసనగా గురువారం జిల్లా కలెక్టరేట్ లో ట్రెసా అధ్యక్షులు పి.సత్యనారాయణ నాయకత్వంలో ట్రెసా,టీఎన్జీవోస్, టీజీవోస్,టిజిటీఏ, అధ్యక్ష కార్యదర్శులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవిన్యూ అధికారి బి.హరిసింగ్ వరంగల్ రూరల్ ఆర్డీవో సిహెచ్ మహేందర్ జి, నర్సంపేట ఆర్డీవో ఎన్.రవి, షఫీ అహ్మద్, జగన్మోహన్ రావు, రత్నవీరా చారి, మురళీధర్ రెడ్డి, ఫణికుమార్ టిజిటిఏ రాష్ట్ర సహా అధ్యక్షలు పూల్ సింగ్ జిల్లా అధ్యక్షులు వాసం రామ్ మూర్తి, హేమ నాయక్, సారంగపాణి తదితరులు పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ కు బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే క్షమాపణ చెప్పే వరకు వదిలే ప్రసక్తే లేదన్నారు. ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు.