
హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ ఇబ్బందుల నుంచి తప్పించుకుని తమ గమ్యానికి సులువుగా, వేగంగా చేరుకునే మార్గం మెట్రో రైలు.
ఎంతో మంది ఉద్యోగస్తులు రాత్రి 10 గంటల తర్వాత కూడా తమ ఇళ్లకు వెళుతుంటారు.
ప్రజల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన ఈ మెట్రో రైలు వేళలను పొడిగించకపోవడం నగర వాసులకు తీవ్ర ఇబ్బందిని కలుగజేస్తోంది.
ఎల్బీనగర్–మియాపూర్, జేబీఎస్–ఎంజీబీఎస్, నాగోల్–రాయదుర్గం మూడు రూట్లలో ఉదయం 6 నుంచి రాత్రి 9.30 గంటల వరకు మాత్రమే మెట్రో రైళ్లు నడుస్తున్నాయి.
చివరి రైలు గమ్యస్థానాలకు రాత్రి 10.30 గంటలకు చేరుకుంటుంది.
హైదరాబాద్‌లో అదే సమయంలో వివిధ వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు ముగించుకొని రాత్రి పొద్దుపోయాక ఇళ్లకు చేరుకుంటుంటారు.
ఈ నేపథ్యంలో మెట్రో రైలు సర్వీసులను అర్ధరాత్రి 12 గంటల వరకు నడపాలన్న డిమాండ్లు సర్వత్రా వెల్లువెత్తుతున్నాయి.
కోవిడ్ కలకలకం నుంచి అన్ని రంగాలు ఇప్పుడిప్పుడే గాడిన పడుతున్న నేపథ్యంలో రైళ్ల వేళలు పొడిగించడం అనివార్యమని ప్రజారవాణా రంగ నిపుణులు సైతం స్పష్టం చేస్తున్నారు.
నగరంలో మూడు మార్గాల్లో 69 కి.మీ మార్గంలో మెట్రో రైలు సేవలు అందుబాటులో ఉన్నాయి. ఈ రూట్లలో గతేడాది మార్చికి ముందు (లాక్‌డౌన్‌కు) నిత్యం నాలుగు లక్షల మంది ప్రయాణించేవారు.
సెలవులు, ఇతర పర్వదినాల సందర్భంగా రద్దీ మరో 50 వేల మేర పెరిగేది. కానీ ప్రస్తుతం మూడు రూట్లలో కేవలం 2 లక్షల మంది మాత్రమే మెట్రో రైల్లో ప్రయాణిస్తున్నారు.
ఇటీవల ఎండల తీవ్రత స్వల్పంగా పెరగడంతో రద్దీ 5 శాతం మేర పెరిగినట్లు తెలుస్తోంది.
కాగా ఐటీ కారిడార్‌లో వందలాది ఐటీ, బీపీఓ, కేవీపీ కంపెనీలు ఉద్యోగులకు ఈ ఏడాది డిసెంబరు వరకు వర్క్ ఫ్రం హోంకు అనుమతించడంతో మెట్రో రద్దీ అనూహ్యంగా పడిపోయిన విషయం విదితమే.
మరోవైపు మెట్రో స్టేషన్లలో పార్కింగ్ బాదుడు, స్టేషన్ల నుంచి గమ్యస్థానాలకు చేరుకునేందుకు ఆటోలు, క్యాబ్‌లను ఆశ్రయించి ప్రయాణీకులు జేబులు గుల్ల చేసుకోవాల్సిన దుస్థితి నెలకొంది.
దీంతో మెట్రోకు అనుకున్న స్థాయిలో ఆదరణ పెరగడం లేదు.
మెట్రో ప్రాజెక్టు నిర్మాణ ఒప్పందం (2010) ప్రకారం ఎల్బీనగర్–మియాపూర్, జేబీఎస్–ఎంజీబీఎస్, నాగోల్–రాయదుర్గం రూట్లలో ప్రయాణీకుల సంఖ్య సుమారు 16 లక్షలు ఉంటుందని అంచనా వేశారు.
కానీ నిర్మాణ సంస్థ అంచనాలు లెక్క తప్పాయి. ప్రస్తుత పరిస్థితుల్లో 4 లక్షల మార్కును ఎప్పుడు చేరుకుంటుందా అన్నది సస్పెన్స్‌గా మారింది.