ఆస్ట్రేలియాలో ఏపీ వాసి అనుమానాస్పద మృతి

275

ప్ర‌పంచంలోని దాదాపు అన్ని దేశాల్లో తెలుగు వారు నివ‌సిస్తున్నారు. పొట్ట‌కూటి కోసం వెళ్లిన తెలుగు వాళ్లు అనుమాస్ప‌దంగా మృతి చెంద‌డం మ‌నం చాలాసార్లు చూశాం.

మ‌రో తాజా ఘ‌ట‌న వెలుగులోకి వ‌చ్చింది. ఆస్ట్రేలియాలో తెలుగు వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు.

ప్రకాశం జిల్లా కొరిశెపాడు మండలం పమిడిపాడుకు చెందిన రావి హరీష్‌బాబు ఆస్ట్రేలియాలోని అడిలైట్‌ స్టేట్‌లోని తన ఇంట్లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు.

మృతదేహాన్ని కనుగొన్న స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. రెండేళ్ల క్రితమే హరీష్‌కు వివాహమైంది. పది నెలల క్రితమే ఓ బాబు పుట్టాడు.

కరోనా కారణంగా స్వదేశానికి వచ్చే అవకాశం లేకపోవడంతో హరీష్‌ ఆస్ట్రేలియాలోనే ఉండిపోయాడు. ఇంజనీరింగ్ పూర్తి చేసిన హరీష్‌ ఆస్ట్రేలియాలో వ్యాపారం చేస్తున్నాడు.

వ్యాపార లావాదేవీల కారణంగా హరీష్‌ను హత్య చేసి ఉంటారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. మృతదేహాన్ని స్వదేశానికి తీసుకువచ్చేందుకు ప్రభుత్వం సాయం చేయాలని వేడుకుంటున్నారు.

వ్యాపారాల్లో ఏదో విబేధాలు ఉండడంతో దానిని సెటిల్ చేసుకుని మ‌రో బిజినెస్ పెట్టుకోవాలని తన కొడుకు అనుకున్నట్లు హ‌రీష్ తండ్రి రావి పూర్ణచంద్రరావు వెల్లడించారు.

ఇండియా రావాల్సి వస్తుందని వ్యాపారం చేయకుండా ఉద్యోగానికి వెళుతున్నాడని ఆయ‌న తెలిపారు. తన బిడ్డ మృతదేహాన్ని త్వరగా ఇక్కడకు తీసుకొచ్చేందుకు ప్ర‌భుత్వం కృషి చేయాలని వేడుకున్నారు.

త‌న కుమారుడి అనుమానాస్ప‌ద మృతిపై దర్యాప్తు చేయాలని కోరుతున్నారు.