బాలికల విద్య కోసం, మహిళల హక్కుల కోసం పోరాటంలో తాలిబన్ల తూటాలను ఎదుర్కొన్న నోబెల్ బహుమతి గ్రహీత యూసఫ్‌జాయ్ మలాలాకు మళ్లీ తాలిబన్ల బెదిరింపులు వస్తున్నాయి.
2012లో జరిగిన కాల్పుల్లో ఆమె గాయపడి మళ్లీ ఊపిరిపోసుకున్న సంగతి తెలిసిందే. గతంలో మలాలాపై కాల్పులకు తెగబడ్డ వ్యక్తి తాజాగా ఆమెపై మరోసారి బెదిరింపులకు పాల్పడ్డాడు.
దీనికి మలాలా గట్టిగానే జవాబిచ్చింది. అతను జైలు నుంచి ఎలా తప్పించుకున్నాడని పాకిస్థాన్ ప్రభుత్వాన్ని నిలదీసింది.
ఎహ్సానుల్లా ఎహ్సాన్ అనే వ్యక్తికి ఉగ్రవాద సంస్థలతో సత్సంబంధాలున్నాయి. ఇతను మలాలా దేహంలో మూడు బుల్లెట్లు దింపినప్పటికీ ఆమె తన బలమైన సంకల్పంతో తిరిగి జీవించింది.
అమెరికాలో చికిత్స అనంతరం మలాలా ప్రాణాపాయం నుంచి బయటపడింది. అయితే అప్పటి ఆ ఆగంతకుడు మరోసారి ట్విట్టర్ ద్వారా మలాలాకు బెదిరింపు మెసేజ్‌లు పెట్టాడు.
‘ఇంటికి తిరిగి వచ్చెయ్.. నీతో, మీ నాన్నతో లెక్కలు తేల్చుకోవాల్సిన అవసరం ఉంది. ఈసారి ఎలాంటి పొరపాటూ జరగదు’ అని ఆ వ్యక్తి ట్వీట్ చేశాడు.
కానీ అతని ట్వీట్‌కు మలాలా తగిన సమాధానం చెప్పింది. ‘తెహ్రీక్ ఎ తాలిబన్ పాకిస్తాన్ అనే సంస్థకు ఇతడు మాజీ అధికార ప్రతినిధి. గతంలో నాపై ఇంకా చాలా మందిపై దాడికి పాల్పడింది ఇతనే.
ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రజలను బెదిరిస్తున్నాడు. ఇతడు జైలు నుంచి ఎలా తప్పించుకున్నాడు?’ అని మలాలా ట్వీట్ చేసింది. ఈ ట్వీట్‌ను పాక్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్, పాకిస్తాన్ మిలిటరీని ట్యాగ్ చేసింది.
వెంటనే స్పందించిన ట్విట్టర్.. ఎహ్సాన్ ఖాతాను తొలగించింది. 2017లో పాక్ మిలిటరీ ఎహ్సాన్‌ను అరెస్ట్ చేసింది. పాకిస్తాన్ ఇంటలీజెన్స్ ఎజెన్సీ అదుపులో ఉన్న ఇతడు 2020 జనవరిలో తప్పించుకున్నాడు.
అతను అరెస్ట్ కావడం, తిరిగి తప్పించుకోవడం ఇప్పటికీ అంతుచిక్కని అంశంగానే మిగిలిపోయింది. జైలు నుంచి తప్పించుకున్నాక ఇతను పాక్‌కు చెందిన వివిధ మీడియా మాధ్యమాల్లో ఇంటర్వ్యూలు కూడా ఇచ్చాడు. ఆ ఇంటర్వ్యూలలో బెదిరింపులకు కూడా పాల్పడ్డాడు.