గురువుకు నెలకి లక్ష జీతం ఇచ్చి తెలుగు నేర్చుకుంటున్న లోకేష్

788
lokesh learning telugu

గురువుకు శిష్య ప్రభుత్వం మూల్యం చెల్లించుకుంది. నడకలు నేర్పిన, నేర్పుతున్న గురువుకు శిష్యుడు తగు విధంగా గౌరవించుకుంటున్నారు. ఆ గురువు పెద్ది రామారావు అయితే, శిష్యుడు ఏపీ మంత్రి నారా లోకేష్. తెలుగువాడిగా పుట్టి తెలుగు దేశం పార్టీ మంత్రిగా వుండి తెలుగులో మాట్లాడటానికి శిక్షణనిచ్చే గురువును లోకేష్ ప్రత్యేకంగా గౌరవించుకున్నారు. మాట్లాడేటప్పుడు తప్పులు మాట్లాడే లోకేష్‌ను ఎప్పటికప్పుడు గైడ్ చేసే గురువు పెద్ది రామారావును గతంలోనే రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికా మండలి సభ్యుడిగా నియమించింది. ఈ క్రమంలో పెద్ది రామారావును తెలుగు శిక్షకుడిగా లోకేష్ నియమించుకున్నారు.



ఆయనకు నెలకు రూ. లక్ష వేతనం, హెచ్‌ఆర్‌ఏ కింద రూ. 35 వేలు చెల్లించాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే ప్రభుత్వ సలహాదారుతో సమానంగా ఇతర అలవెన్సులన్నీ వర్తింపజేయాలంటూ బుధవారం ప్రణాళికా శాఖ కార్యదర్శి సంజయ్‌గుప్త ప్రకటించారు. ఆయనకు ఒక ప్రైవేట్‌ అసిస్టెంట్‌ను, ఒక ప్రైవేట్‌ కార్యదర్శిని, ఇద్దరు ఆఫీస్‌ సబార్డినేట్స్‌ను కూడా ఇవ్వనున్నట్లు జీవో జారీ చేశారు.

తెలుగు నాటక రచయితగా పెద్ది రామారావు గుర్తింపు పొందారు. దూరదర్శన్ చానల్లో ప్రసారమైన ‘రుతురాగాలు’ సీరియల్‌కు ఆయన మాటల రచయిత. హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ నుంచి ఫైన్‌ ఆర్ట్స్‌లో పీహెచ్‌డీ చేశారు. థియేటర్ ఆర్ట్స్‌కి సంబంధించి ఉపాధ్యాయ వృత్తిలో మంచి అనుభవం వుంది. 2009 ఎన్నికల్లో ప్రచారం చేసిన జూనియర్‌ ఎన్టీఆర్‌కు కూడా పెద్ది రామారావే గురువుగా వ్యవహరించారు. నటుడు రాజీవ్ కనకాలకు రామారావు బావ అవుతారు. కొంత కాలంగా లోకేష్‌కు తెలుగు మాట్లాడే తీరులో శిక్షకుడిగా వుంటున్నారు రామారావు. లోకేష్ తెలుగు ప్రసంగాలన్నీ రామారావు దిద్దినవే వుండటం గమనార్హం.