కేసీఆర్ కుటుంబం జైలుకే… అప్పటి వరకు ఢిల్లీ లోనే..!

240
komatireddy-shocking-comments-on-kcr

తెలంగాణ సీఎం కే. చంద్రశేఖర్ రావు మీద ఆయన కుటుంబం మీద కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి వెంకట రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. అసెంబ్లీలో మైకు విసిరి సభ్యత్వం కోల్పోయిన సీఎల్పీ ఉపనాయకుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి కొన్నాళ్లుగా కేసీఆర్ మీద విరుచుకుపడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ ప్లీనరీకి హాజరయ్యేందుకు ఢిల్లీ వెళ్లిన కోమటిరెడ్డి అక్కడ మాట్లాడుతూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. దేశ చరిత్రలోనే ఏనాడు లేని విధంగా ఇలా ఇద్దరు ఎమ్యెల్యే ల సభ్యత్వాన్ని ఎలా రద్దు చేస్తారని ఆయన ప్రశ్నించారు. అసెంబ్లీలోకి పోలీసులు రాకూడదని నిబంధన ఉందని మరి అనుమతి లేకుండా ఎలా వచ్చారని నిలదీశారు. కేసీఆర్ కుటుంబాన్ని జైల్లో పెట్టాలనేదే తన లక్ష్యమని – ఢిల్లీలోనే ఉండి సీబీఐ – ఈడీ – సీవీసీకి కేసీఆర్ కుటుంబ అవినీతిపై ఫిర్యాదు చేస్తానని కోమటిరెడ్డి తెలిపారు. అప్పటి వరకు ఢిల్లీ వదల నని ప్రతిజ్ఞ చేసారు.



 

తెలంగాణలో గత నాలుగేల్ల నుంచి కేసీఆర్ ప్రజలందరిని కులాల వారిగా విడదీస్తూ మోసం చేస్తున్నారని రాష్ట్రాన్ని దోచుకొని తెలంగాణ మొత్తం ఖాళీ చేశారని కోమటిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. అప్పులు తీసుకొని వచ్చి రాష్టాన్ని దివాలా తిసేలా చేశారని, ఆంధ్ర కాంట్రాక్టర్లకు తెలంగాణ ఆస్తులను దోచి పెట్టారని ఆరోపించారు. కేసీఆర్ మోసాలను ప్రజలందరూ గమనిస్తున్నారని తెలిపారు. బడ్జెట్ పెరిగే కొద్ది పుస్తక సైజ్ కూడా పెరగాలని, ఇచ్చిన బడ్జెట్లో ఏ ఒక్క రంగానికి క్లారిటీ ఇవ్వలేదని ఆయన తెలిపారు. 12వ తేదీ గవర్నర్ ప్రసంగం చూసి ఎమ్మెల్యేలం అందరం ఆశ్చర్యానికి గురి అయ్యామని, వ్యవసాయ రంగానికి సంబంధించి ప్రస్తావన ఎక్కడ రాలేదని తెలిపారు. నాలుగు వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని కోమటిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఆరోగ్య శ్రీ లేకపోవడం వల్ల పేదవాళ్లు చనిపోతున్నారని ప్రగతిభవన్ నుంచి కేసీఆర్ బయటకే రాడని ఎద్దేవా చేశారు. కూర్చున్న కుర్చీలోంచి లేవలేడు కానీ నీకు థర్డ్ ఫ్రెంట్ అవసరమా? అని కేసీఆర్ పై కోమటిరెడ్డి నిప్పులు చెరిగారు.


ప్రధానమంత్రి మోడీని, కాంగ్రెస్ అద్యక్షుడు రాహుల్ గాంధీని గాడు అని ఎలా సంబోధిస్తారంటూ కేసీఆర్ పై కోమటిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి జగదీశ్ రెడ్డి సహకారంతో తన అనుచరుడు బొడ్డుపల్లి శ్రీనివాస్ ను చంపించారని ఆయన ఆరోపించారు. అసెంబ్లీ సమావేశాల ప్రారంభం రోజున సభలో కాంగ్రెస్ సభ్యులు పెద్దఎత్తున ఆందోళన చేసిన సంగతి తెలిసిందే. ఆ క్రమంలో కొందరు ఎమ్యెల్యేలు పుస్తకాలు చించి విసిరేశారు. కోమటిరెడ్డి ఆవేశంగా మైకు తీసుకుని విసిరేశారు. అది వెళ్లి మండలి చైర్మన్ స్వామిగౌడ్ కి తగిలింది. దాంతో  కోమటిరెడ్డి, సంపత్ ఎమ్యెల్యే సభ్యత్వాలను రద్దు చేసిన విషయం తెలిసిందే.