ప్రొఫెసర్ కోదండరాం నేతృత్వంలోని తెలంగాణ జన సమితి (టీజేఎస్)లో తెలంగాణ ఇంటి పార్టీ విలీనం దిశగా చర్చలు జరుగుతున్నాయి. ఇంటి పార్టీ వ్యవస్థాపకులైన చెరుకు సుధాకర్‌కు, మాజీ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డికి టీజేఎస్‌లో తగిన ప్రాధాన్యం ఇవ్వాలనే అంశంపైనా స్థూలంగా అంగీకారం కుదిరినట్టుగా తెలుస్తోంది.
ఒకటి, రెండురోజుల్లో దీనిపై స్పష్టత వస్తుందని జేఏసీ వర్గాలు వెల్లడించాయి. సుధాకర్‌కు తెలంగాణ జన సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడిగా, శ్రీనివాస్‌రెడ్డికి టీజేఎస్ ప్రజాప్రతినిధుల ఫోరం చైర్మన్‌గా బాధ్యతలను అప్పగించనున్న ట్టుగా జేఏసీ వర్గాలు వెల్లడించాయి. ఈ నెల 29న జరిగే టీజేఎస్ ఆవిర్భావ సభలోపే ఇంటిపార్టీ విలీన ప్రక్రియ పూర్తి చేసుకోవాలనే యోచనలో కోదండరాం ఉన్నట్టు తెలుస్తోంది.
టీజేఎస్‌లో న్యాయవిభాగం, సాంస్కృతిక విభాగం, విద్యార్థి, నిరుద్యోగులతో అనుబంధ సంఘాలను బలోపేతం చేసే ప్రతిపాదనలు ఈ చర్చల్లో ఉన్నాయి. వివిధ అనుబంధ సంఘాలతో అధికార పార్టీపై ప్రణాళికబద్ధంగా పోరాటం చేయడానికి చర్చలు జరుపుతున్నారు.
సామాజిక న్యాయ నినాదంతో…
టీజేఎస్ ఆవిర్భావసభలో అన్ని సామాజికవర్గాలకు, వృత్తి సంఘాలకు ప్రాతినిధ్యం కల్పించేవిధంగా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఇందులో భాగంగానే సామాజిక న్యాయం నినాదంతో ఆవిర్భవించిన ఇంటి పార్టీని కలుపుకోవాలనే యోచనతో ఉన్నారు. సుధాకర్ టీఆర్‌ఎస్‌లో ఆవిర్భావం నుంచి క్రియాశీలంగా వ్యవహరించారు. టీఆర్‌ఎస్ లో పొలిట్‌బ్యూరో సభ్యుడిగా పనిచేశారు. తెలం గాణ ఏర్పాటు దాకా ఆ పార్టీలోనే ఉన్నారు. అనంతరం కేసీఆర్‌తో విభేదించి బయటకు వచ్చి తెలంగాణ ఇంటి పార్టీని ఏర్పాటు చేశారు.