ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో రెండవసారి అధికార పగ్గాలు చేపట్టిన కేసీఆర్ ప్రభుత్వం మొదటి నుండి ముఖ్యమంత్రి మార్పు జరగనుందని,కెసిఆర్ కేంద్రంలో చక్రం తిప్పబోతున్నారని, రాష్ట్రంలో తన కుమారుడు కేటీఆర్ ముఖ్యమంత్రి పదవి అధిరోహించబోతున్నారనే వార్తలు వచ్చాయి. దానికనుగుణంగానే తెలంగాణ రాష్ట్రసమితి పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమించడం, పార్టీలో మరియు ప్రభుత్వంలో ఎవరికీయ లేని స్థానం కేటీఆర్ కు ఇవ్వడం, రెండవసారి జరిగిన శాసనసభ ఎన్నికలలో ప్రతినియోజకవర్గంలో ప్రచారంలో భాగంగా, బహిరంగ సమావేశాలకు ముఖ్యఅతిథిగా వెళ్లడం, మొదటి ప్రభుత్వంలో హైదరాబాద్ మునిసిపల్ ఎన్నికలకు అంతాతానై, గుర్తింపు తెచ్చుకోవడానికి ప్రయత్నించడం అనేవి భవిష్యత్ లో ముఖ్యమంత్రి పదవి చేపట్టడానికి దారులు వేసుకుంటున్నాడని అందరికీ తెలిసిన విషయమే.
అందులో భాగంగానే తన కుటుంబానికి చెందిన హరీష్ రావు పార్టీ ఆవిర్భావం నుండి కేసీఆర్ కు కుడిభుజంగా మెలుగుతూ, ఉద్యమంలో సైతం కీలకపాత్ర వహించి, పార్టీ బలోపేతానికి, అధికారం చేపట్టడంలో ప్రత్యేకమైనపాత్ర వహించాడన్నవిషయం నగ్నసత్యం. కానీ ఒక్కసారిగా కేటీఆర్ ఎదుగుతున్న క్రమంలో హరీష్ రావును కాస్త పక్కకు పెట్టారన్నది అవునన్నా, కాదన్న ముమ్మాటికి వాస్తవం.
అదేవిధంగా ప్రభుత్వం కొలువుదీరాక సాక్షాత్ ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీసమావేశాల సాక్షిగా, కేంద్ర రాజకీయాలు చేయవద్దా? ప్రాంతీయ పార్టీలకు చెందిన వ్యక్తులు కేంద్రంలో మద్దతుకూడగట్టి ప్రధానమంత్రి కావద్దా? అని చలోక్తులు విసురుతూ, ఈమధ్యన రాష్ట్రంలో కేసీఆర్ ఆరోగ్యం బాగాలేదని, వైద్యంకొరకు ఇతర దేశాలకు వెళుతున్నాడని, కేటీఆర్ ముఖ్యమంత్రి కాబోతున్నాడని వార్తలు వస్తున్నాయి.
నాకేం అయ్యింది? ఆరోగ్యంగానే ఉన్నాను, నేనున్నంతవరకు నేనే ముఖ్యమంత్రినంటూ కాసేపు సభలో నవ్వులు కురిపించిన మాట వాస్తవం. ఏది ఏమైనప్పటికీ రాజకీయాలలో అవసరానికనుగుణంగా, సమయానికనుకూలంగా పరిణామాలు, సమీకరణాలు మారుతుంటాయి.
“ నిప్పు లేనిదే పొగ రాదు అన్నట్లు” అనే సామెతమాదిరిగా ఎలాంటిచర్చ లేకుండా వార్త బయటికి రాదన్నది నగ్నసత్యం. ఈమధ్యన రాష్ట్రంలో కేటీఆర్ అతిత్వరలో ముఖ్యమంత్రి కాబోతున్నారని వార్త వివిధమాధ్యమాలలో వైరలవుతున్నది. దానికి తగినట్లుగానే అధికార పార్టీకి చెందిన మంత్రులు ఈటెల రాజేందర్, తలసాని శ్రీనివాస్ యాదవ్, పద్మారావులాంటి వారు మీడియా సాక్షిగా కేటీఆర్ కి ముఖ్యమంత్రి కావడానికి అన్ని అర్హతలున్నాయని, అతిత్వరలో తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి పీఠం ఎక్కబోతున్నారని సెలవివ్వడమనేది బలాన్నిచేకూర్చే విషయంగా చెప్పవచ్చు.
కానీ రాజ్యాంగ బద్ధంగా ప్రజాస్వామిక వ్యవస్థలో కుటుంబపాలనకు ప్రాముఖ్యతనివ్వడం సరైనపద్ధతి అనిపించుకోదు.ఇది ప్రజాస్వామ్యానికి విరుద్ధమని అందరికీ తెలిసినవిషయమే.
ప్రత్యేక తెలంగాణరాష్ట్ర ఉద్యమంలో భాగంగా తొలి ముఖ్యమంత్రి దళితుడే అని ప్రకటించిన, రాజకీయ సమీకరణాలలో భాగంగా అది వాస్తవరూపం దాల్చలేదు. ప్రస్తుతం మరొకసారి ముఖ్యమంత్రి మార్పు అనేఅంశం తెరపైకివచ్చింది.ఒకవేళ కేసీఆర్ విశ్రాంతి తీసుకోవాలనుకుంటే ముఖ్యమంత్రి పీఠాన్ని తన కుమారుడికి ఇవ్వకుండా, విద్యార్థి దశ నుండి పలుసమస్యలపై పోరాడి, తెలంగాణ రాష్ట్రసమితిపార్టీ ఆవిర్భావం నుండి పార్టీలో ఉంటూ, పార్టీ అధినాయకత్వం చెప్పిన విధంగా, తూ.చా.తప్పకుండా నడుచుకుంటూ, తనవంతుబాధ్యతను సక్రమంగా నిర్వర్తిస్తూ, పార్టీబలోపేతానికి తనవంతు పాత్రవహిస్తూ, ప్రత్యేక తెలంగాణరాష్ట్రంలో కీలకంగా పనిచేసి, వైయస్ రాజశేఖర్రెడ్డి హయాంలో టీఆర్ఎస్ ఎల్పీ నేతగా వ్యవహరించి తనవాగ్ధాటితో అందరిని ఆకట్టుకున్న విషయం నగ్నసత్యం.
మనరాష్ట్రం ఆవిర్భవించాక 2014లో తొలి మంత్రివర్గంలో ఆర్థిక, ప్రణాళిక శాఖ, చిన్నమొత్తాల పొదుపు, రాష్ట్రలాటరీలు, పౌరసరఫరాలు, తూనికలు కొలతలు, వినియోగదారుల వ్యవహారాలశాఖ బాధ్యతలు నిర్వహించి, తనదైనశైలిలో ప్రత్యేకతను చాటుకుంటూ, 2019లో రెండవసారి ఏర్పడిన ప్రభుత్వంలో మంత్రివర్గంలో వైద్య ఆరోగ్యశాఖమంత్రిగా విధులు నిర్వర్తిస్తూ, ఈమధ్యన ఒక్కసారిగా ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన కరోనా నేపథ్యంలో ఆరోగ్యశాఖమంత్రిగా విధులు నిర్వర్తించడంలో భాగంగా డాక్టర్లు, పోలీసులు, సఫాయి కార్మికులవలే తనప్రాణాలకు తెగించి, ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ, సమీక్షిస్తూ, కావలసిన వైద్యసామగ్రి, తదితర సౌకర్యాల ఏర్పాట్లకు పాటుపడుతూ, సిబ్బందిని ప్రోత్సహిస్తూ, అండగానిలిచి, ధైర్యం ఇస్తూ, తన బాధ్యతలను సక్రమంగానిర్వర్తించి ప్రజలచే అభినందించబడ్డారనడంలో ఎలాంటి అనుమానం అక్కరలేదు.
టిఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపకంలో భాగమైన ఆలె నరేందర్, విజయశాంతి లాంటివారు అభిప్రాయ భేదాలతో ప్రక్కకు జరిగిన, ప్రభుత్వంలో సైతం సీనియర్ మంత్రులుగా నున్నవారు సైతం పార్టీకి దూరం కాబడటం జరుగుతున్న, మొదటినుంచి ఇప్పటివరకు కేవలం ఈటెల రాజేందర్ ఒక్కరుమాత్రమే నమ్మినబంటుగా కొనసాగుతూ వస్తున్నాడు. పార్టీలో రెండవస్థానాన్ని ఆక్రమించాలంటే ఇంతకుమించి ఇంకేం అర్హతలు కావాలి?
రాజకీయాలలో ఒకనాయకుడిని అణగద్రొక్కాలన్నా , పైకి తీసుకురావాలన్న క్షణంలో జరిగేపని. నిస్వార్థంతో సామాజికాభివృద్ధికి పాటుపడుతూ, సమాజ సంక్షేమమే ధ్యేయంగా భావించి పనిచేసే నాయకులకు సైతం ఒక్కసారిగా పాతాళంలోకి అణగద్రొక్కి కోలుకోలేనివిధంగా చేయవచ్చు. అలాగే ఏమితెలియని వ్యక్తిని ప్రణాళికయుతంగా అత్యుత్తమవ్యక్తిగా చిత్రీకరించే వెసులుబాటును రాజకీయాలలో చూడవచ్చు.
ఇక్కడ ఒకప్రత్యేకమైన విషయం సంతరించుకున్నది.నిబద్ధతతో ప్రజలపక్షాన నిలిచి,పనిచేసేవ్యక్తిని ఎంతగా అనగద్రొక్కాలనుకుంటే అంతగా ఆదరణపొందే అవకాశం సైతం రాజకీయాలలో దాగిఉన్నది.అంటే రాజకీయాలలో మనుగడ సాగించాలంటే ఒళ్ళంతా కళ్ళుచేసుకుని,అనుక్షణం పరిశీలిస్తూ,రాబోయేముప్పును సైతం పసిగడుతూ, ప్రజలలో ఆదరణపోకుండా చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఈవిషయాలలో సైతం ఈటెల రాజేందర్ నూటికినూరుపాళ్లు విజయం సాధించి, అసలుసిసలైన రాజకీయవేత్తగా శాశ్వతంగా ముద్రవేసుకున్నారనడంలో ఎలాంటి అబద్ధం లేదు.
ఈటల రాజేందర్ రాష్ట్రంలో 52లక్షల జనాభాకలిగిన ముదిరాజ్ సామాజికవర్గానికి చెందినవాడైనా, మొదటి నుండి ఉద్యమనేపథ్యం కలిగిన వ్యక్తిగా, దళితబహుజనులకు అండగా ఉంటూ, వారి సమస్యలకు పరిష్కార మార్గాలను చూపెడుతూ, అందరివాడిలా అజాతశత్రువుగా పేరుతెచ్చుకుని,తనకంటూ ఒక ప్రత్యేకతను సంతరించుకున్నారనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.
ఇప్పటికీ పార్టీ అధిష్టానానికి కట్టుబడి,కేటీఆర్ ముఖ్యమంత్రి కావాలని ప్రకటనలిస్తున్నారే తప్పా,అన్ని అర్హతలు ఉండికూడా ఆపదవిని ఆశించకపోవడమనేది ఆయనకే చెల్లిందని చెప్పడంలో ఎలాంటి అవాస్తవంలేదు.
ప్రస్తుత పరిణామాలదృష్ట్యా ప్రతిపక్షపార్టీలు ఆరోపిస్తున్నట్లుగా అధికారపార్టీ ముఖ్యమంత్రి పదవిమార్పుకు పూనుకుంటే అన్నివిధాలుగా సరిఅయిన వ్యక్తి,ఏ సమీకరణాలలో చూసిన మొదటిస్థానంలో ఉన్నవ్యక్తిగా,సామాజిక నేపథ్యానుసారంగా చూసిన అన్ని అర్హతలున్నవ్యక్తిగా,పార్టీలకతీతంగా అజాతశత్రువుగా పేరు తెచ్చుకున్న ఈటల రాజేందర్ కి ఆస్థానాన్ని కల్పించి, అధికారపార్టీగా తన నిబద్ధతను చాటుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉన్నది.
అందుకే ఏదిఏమైనప్పటికీ సమాజమోదంపొందే వ్యక్తికి మాత్రమే అవకాశాలురావాలని ఆశిద్దాం.
డా.పోలం సైదులు