భారీ మొత్తంలో అంబర్ జర్దా ప్యాకెట్లు పట్టుకున్న హుస్నాబాద్ పోలీసులు

712
Husnabad police

సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో బుధవారం ఉదయం నాలుగు గంటలకు హుస్నాబాద్ ఎస్సై సుధాకర్, తన సిబ్బందితో కలసి వాహనాలు తనిఖీ చేస్తుండగా అనుమానాస్పదంగా కనిపించిన TS-25-B-5887 నంబర్ గల కారు లో తనిఖీ చేయగా అందులో భారీ మొత్తంలో 9 సంచుల్లో ఉన్న ప్రభుత్వ నిషేధిత అంబర్ ప్యాకెట్లను పట్టుకున్నట్లు, వీటి విలువ సుమారు 4 లక్షల 50 వేల రూపాయలు ఉంటుందని ఏసిపి మహేందర్ తెలిపారు.

భూపాలపల్లి జిల్లా టేకుమాట్ల మండలం వెలిచాల గ్రామానికి చెందిన దావరవేని నారాయణరావు అనే వ్యక్తి బీదర్ నుండి టేకుమట్లకు తరలిస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వం నిషేధించిన అంబర్ మరియు గుట్కా ప్యాకెట్లను బీదర్ నుండి టెకుమట్ల కు అధిక రేటుకు అమ్ముదామని తరలిస్తున్నామని నిందితుడు తెలిపాడు. ఇతనితో పాటు ఇతనికి సహాయకుడిగా కారులో ఉన్న భూపాలపల్లి జిల్లాకు చెందిన నారేండ్ల చందు, కార్ డ్రైవర్ కుంభం రమేష్ లను అరెస్టు చేసి కేసు నమోదు చేసి కారును సీజ్ చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏసీపీ మహేందర్ తెలిపారు.

ఈ సందర్భంగా హుస్నాబాద్ ఏసీపీ మహేందర్ మాట్లాడుతూ ప్రభుత్వం నిషేధించిన గుట్కాలను ఎవరైనా కలిగి ఉన్నా, మరియు అమ్మిన, ఇతర ప్రదేశాలకు ట్రాన్స్పోర్టు చేసిన వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈరోజు ఉదయం గుట్కా ప్యాకెట్లు పట్టుకున్న ఎస్ఐ సుధాకర్, హెడ్ కానిస్టేబుల్ సంపత్, కానిస్టేబుల్ త్యాగరాజు, హోంగార్డు మల్లారెడ్డి లను ఏసిపి అభినందించారు. త్వరలో రివార్డు అందజేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో హుస్నాబాద్ సీఐ శ్రీనివాస్, మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.