ఓ జంటను ఒక్కటి చేసిన మెట్రో ట్రెయిన్

307
how-kochi-metro-saved-a-wedding

కొచ్చి మెట్రో.. ఈ సంవత్సరం జూన్‌లో ప్రధాని మోదీచే ప్రారంభమయింది. మొత్తం 11 స్టేషన్లు, 13 కిమీల దూరం ఉన్న మెట్రో లైను కేరళలోని కొచ్చిలో ఉన్న పలరివట్టొమ్ నుంచి అలువా వరకు విస్తరించి ఉంది. గత అక్టోబర్‌లో మరో 18 కిమీల మెట్రో మార్గం నిర్మాణ పనులు కూడా కొనసాగుతున్నాయి. అయితే.. దేశంలో ఏ మెట్రో సాధించని ఓ ఘనతను ఇప్పుడు కొచ్చి మెట్రో సాధించింది. ఓ జంటకు పెండ్లి చేసి వాళ్లను ఓ ఇంటివాళ్లను చేసింది. ఒకవేళ కొచ్చి మెట్రోనే లేకపోతే నిజంగా సమయానికి వాళ్ల పెండ్లి అయ్యేదే కాదు. ఆ కథేందో తెలసుకుందాం పదండి…

అది డిసెంబర్ 23, 2017… ఇదే కేరళలోని పలక్కాడ్‌కు చెందిన రంజిత్ కుమార్ పెండ్లి. ఉదయం 11 గంటలకు ఎర్నాకుళంలో ఆయన పెండ్లి. పలక్కాడ్ నుంచి ఎర్నాకుళం మధ్య 130 కిలోమీటర్ల దూరం ఉంటుంది. అంటే వేగంగా వెళ్తే కనీసం ఓ మూడు గంటల్లో చేరుకోవచ్చు. అలా అనుకొనే ఉదయం 6 గంటలకు ప్రత్యేక కారులో పెళ్లి కొడుకు రంజిత్ కుమార్ ఎర్నాకుళం బయలుదేరాడు. ఓ 100 కిలోమీటర్లు వరకు వెళ్లారు. అలువా అనే ఊరుకు చేరుకున్నారు. అక్కడ నుంచి ఇక బీభత్సమైన ట్రాఫిక్ జామ్ ఉంది. ఇంకో 30 కిలోమీటర్లు వెళ్లాలి. కాని.. ట్రాఫిక్‌లో ఇరుక్కుపోవడంతో ఏం చేయాలో తెలియలేదు రంజిత్‌కు. దీంతో ఎర్నాకుళం వెళ్లడానికి ప్రత్యామ్నాయ మార్గాలను రంజిత్ అన్వేషించాడు. అయినప్పటికీ ఏదీ దొరకలేదు. ఇక.. తను పెండ్లి టైమ్‌కు అక్కడికి చేరుకోలేనేమో.. తన పెండ్లి ఆగిపోతుందేమో అని తెగ టెన్షన్ పడ్డాడు. కాని.. అంతలోనే పక్కన ఉన్నవాళ్లెవరో.. ఈయన పరిస్థితి తెలసుకొని.. మెట్రో ట్రెయిన్‌లో వెళ్లండని సలహా ఇచ్చాడట.

దీంతో వెంటనే అలువాలో ఉన్న మెట్రో స్టేషన్‌కు కుటుంబ సభ్యలతో కలిసి వెళ్లాడు. అక్కడ చూస్తేనేమో చాంతాడంత లైను. టికెట్ తీసుకోవడానికి మరో రెండు గంటలు పట్టేట్టుంది. అయితే.. టికెట్ కౌంటర్‌లో తన పరిస్థితి వివరించి ఎలాగోలా టికెట్లు సంపాదించి మెట్రో ట్రెయిన్‌లో అనుకున్న సమయానికంటే ముందే పెండ్లి మండపానికి చేరుకున్నాడట రంజిత్.

కట్ చేస్తే.. అనుకున్న సమయానికి రంజిత్, ధన్య పెండ్లి జరిగింది. వాళ్లు ఇప్పుడు హ్యాపీగా ఉన్నారు. అయితే.. వాళ్ల పెండ్లి సజావుగా జరగడానికి కారణం కొచ్చి మెట్రో అని… అందుకే దానికి కృతజ్ఞతలు తెలుపుతూ ఓ వీడియోను భార్యభర్తలు ఇద్దరు రిలీజ్ చేశారు. కొచ్చి మెట్రో ఫేస్‌బుక్ పేజీలో ఆ వీడియో పోస్ట్ అయింది.

మరోసారి కట్ చేస్తే… కొచ్చి మెట్రో అధికారులు కొచ్చి వన్ అనే మెట్రో స్మార్ట్ కార్డ్‌ను వాళ్ల పెండ్లికి గిఫ్ట్‌గా ఇచ్చారట. అలా మెట్రో ట్రెయిన్ ఓ జంటను కలిపి జన్మజన్మల పుణ్యం చేసుకున్నది.