ఆర్థికంగా వెనకబడిన వర్గాల జాబితాలో యాదవులు చివరి స్థానంలో ఉంటారు.
అందుకే వారిని అభివృద్ధి చేసేందుకు తెలంగాణ సర్కార్ అనేక కార్యక్రమాలను చేపట్టింది.
అందులో భాగంగా యాదవులు ఆర్థికంగా నిలదొక్కుకొనేందుకు గొర్రెలను పంపిణీ చేసింది.
వాటి సంరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. అధికారంలోకి వచ్చిన వెంటనే గొర్రెల సంరక్షణకు చర్యలు చేపట్టింది.
సముద్రలింగాపూర్‌లో సకల వసతులతో సామూహిక వసతి గృహాలు నిర్మించింది. వీటిని త్వరలో మంత్రి కేటీఆర్ ప్రారంభించనున్నారు.
మంత్రి కేటీఆర్ సహకారంతో 42 సామూహిక పాకలను నిర్మించినట్లు, సముద్రలింగాపూర్ సర్పంచ్ మోతె రాజిరెడ్డి వెల్లడించారు.
సకల సౌకర్యాలు కల్పించామని ఆయన అన్నారు. గంభీరావుపేట మండలంలోని సముద్రలింగాపూర్‌లో 43 యాదవ కుటుంబాలున్నాయి.
ఇక్కడ గొర్రెల హాస్టల్స్‌ను ప్రభుత్వం నిర్మించింది. సముద్రాలింగాపూర్ గుండారం రహదారి పక్కన కుల సంఘానికి చెందిన రెండెకరాల పది గుంటల స్థలంలో సామూహిక ఆవాసాలను నిర్మించారు.
ఉపాధి పథకం కింద వంద శాతం రాయితీపై రూ. 89 లక్షలు నిధులు వెచ్చించారు.
ఆరు మీటర్ల పొడవు, నాలుగు మీటర్ల వెడల్పు, రెండున్నర మీటర్ల ఎత్తుతో పాకలను నిర్మించారు.
ఇందులో 21 గొర్రెలు (20 ఆడ, ఒక మగ) ఉండే విధంగా ఏర్పాట్లు చేశారు.
ఇందులో నీటి సౌకర్యం, వసతి, ఎండ, వాన, చలి నుంచి రక్షణకు తగిన చర్యలు చేపట్టారు. గొర్రేలకు వసతి గృహాలు నిర్మించడంపై సర్వత్రా హర్షం వ్యక్తమౌతోంది.