న్యాయవాద దంపతుల హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న పెద్దపల్లి జడ్పీ చైర్మన్ పుట్ట మధు స్పందించారు.
శనివారం పెద్దపల్లిలో టీఆర్ఎస్ సభ్యత్వ నమోదులో పాల్గొన్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ తానెక్కడికీ పారిపోలేదని మంథనిలోనే ఉన్నానని స్పష్టం చేశారు.
సీఎం కేసీఆర్, కేటీఆర్‌ను కలిసేందుకు ప్రయత్నించినట్లు వచ్చిన వార్తల్లో నిజం లేదని అన్నారు.
న్యాయవాద దంపతుల హత్యపై పోలీసుల విచారణ తర్వాతే స్పందిస్తానని పేర్కొన్నారు. సాక్ష్యాలతో హైదరాబాద్‌లోనే మీడియాతో మాట్లాడతానని పుట్ట మధు చెప్పారు.
ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు కుట్రలను తిప్పికొడతామని హెచ్చరించారు. ఒక బీసీ జెడ్పీ చైర్మన్ కావడాన్ని జీర్ణించుకోలేక విష ప్రచారం చేస్తున్నారని తప్పుబట్టారు.
పోలీసులను విచారణ చేయనిస్తారా..? ఎమ్మెల్యే శ్రీధర్‌బాబుతో కలిసి మీరే చేస్తారా? అని పలు మీడియా సంస్థలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.
శ్రీధర్ బాబు కోట్ల రూపాయలు ఇస్తూ హైదరాబాద్‌లో మీడియాను మేనేజ్ చేస్తే తనకు వ్యతిరేకంగా కథనాలు రాశారని దుయ్యబట్టారు. తన వద్ద డబ్బు లేకుంటే బదనాం చేస్తారా అని ఆవేదన వ్యక్తం చేశారు.