దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి తనయ వైఎస్ షర్మిల చేస్తున్న రాజకీయ పార్టీ ఏర్పాట్లపై ఇతర పార్టీల నుంచి తీవ్ర విమర్శలు వస్తున్నాయి.
ఆయా పార్టీ నాయకులంతా తమదైన శైలిలో స్పందిస్తూ షర్మిలను మానసికంగా బలహీనంగా చేసేందుకు ప్రయత్నం కొనసాగుతోంది.
షర్మిలా పార్టీ ఏర్పాట్లపై బీజేపీ ఎంపి ఎద్దేవా
తాజాగా షర్మిల పార్టీ ఏర్పాట్లపై నిజామాబాద్ బీజేపీ ఎంపి ధర్మపురి ఆనంద్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. షర్మిలా పెట్టబోయే పార్టీ పేరు హల్లేలూయా పార్టీ అని అరవింద్ ఎద్దేవా చేశారు.
తెలంగాణలో రాజన్న రాజ్యం మళ్లీ తీసుకొస్తామన్న షర్మిల వ్యాఖ్యలపై ఆయన తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు. తెలంగాణకు కావాల్సింది రాజన్న రాజ్యం కాదని.. రామ రాజ్యమని అన్నారు.
పార్టీ పెట్టాలన్న ఆలోచనతో వైస్ షర్మిల అనవసరంగా సమయం వృధా చేసుకుంటున్నారని ఆయన అన్నారు.
తెలంగాణలో కొత్త పార్టీ ఏర్పాటుకు కసరత్తు చేస్తున్న వైఎస్ షర్మిల శనివారం (20-2-2021) రంగారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాలకు చెందిన వైఎస్ఆర్ అభిమానులతో సమావేశమయ్యారు.
ఈ సమావేశానికి వచ్చిన వారికి ఫీడ్ బ్యాక్ పేపర్ ఇవ్వడం ఆసక్తికరంగా మారింది. తెలంగాణలో పార్టీ పెట్టాలని కృత నిశ్చయంతో ఉన్న వైఎస్ షర్మిల ఎలా ముందుకు వెళుతుందో అని చాలా మంది ఆసక్తిగా గమనిస్తున్నారు.
అయితే పార్టీ ఏర్పాటు విషమంలో నేతల అభిప్రాయాల కంటే క్షేత్ర స్థాయిలో అభిమానుల అభిప్రాయాలు తెలుసుకోవాలని షర్మిల నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది.
ఫీడ్ బ్యాక్ పత్రంలో పేరు, చిరునామాతో పాటు పలు ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వాలని కోరారు.
ఇందులో సుమారు 11 ప్రశ్నలు ఉన్నట్టు తెలుస్తోంది. ఏర్పాటు చేయబోయే కొత్త పార్టీ ప్రజల్లోకి వెళ్లాలంటే ఏం చేయాలి? తెలంగాణలో వైఎస్ఆర్ అభిమానులు ప్రస్తుతం పడుతున్న కష్టాలేంటి? వాటిని ఎలా తీర్చాలి?
మీ అసెంబ్లీ నియోజకవర్గంలో వైఎస్ఆర్ చేసిన అభివృద్ధి పనులేంటి? అసలు పార్టీ పెట్టడంపై ప్రజలు ఏమనుకుంటున్నారు? రాష్ట్రంలో అధికారంలో ఉన్న కేసీఆర్, టీఆర్ఎస్‌ను, బీజేపీని ఎలా ఎదుర్కోవాలి వంటి ప్రశ్నలు అందులో ఉన్నట్టు సమాచారం.