ఫేస్‌బుక్‌ లో అమ్మాయిలా నటిస్తూ …

291
hacker with the name of girl

అమ్మాయి పేరుతో ఫేస్‌బుక్‌ ఖాతా తెరిచాడు.. మరో వ్యక్తి పంపిన ఫ్రెండ్ రిక్వెస్ట్ ఆమోదించి చాటింగ్‌ చేశాడు. ఫిషింగ్‌ లింక్‌తో అతడి ఫేస్‌బుక్‌ ఖాతాలోకి చొరబడి వివరాలు పసిగట్టి బ్లాక్‌మెయిల్‌ చేసి, చివరకు కటకటాల పాలయ్యాడు. రాచకొండ సైబర్‌క్రైమ్‌ ఏసీపీ హరినాథ్‌ కథనం ప్రకారం.. మౌలాలి హెచ్‌బీకాలనీకి చెందిన మహ్మద్‌ మునీర్‌ అహ్మద్‌ బీటెక్‌ పూర్తి చేశాడు. ఎథికల్‌ హ్యాకింగ్‌ లో మెలకువలు నేర్చుకున్న మునీర్‌ ఆ తర్వాత ‘మెలిన్‌ సోఫియా’ అనే యువతి పేరుతో ఫేస్‌బుక్‌ ఖాతా తెరిచాడు. అపరిచితుడి నుంచి ఫ్రెండ్‌ రిక్వెస్ట్‌ రావడంతో ఆమోదించాడు. ఇద్దరి చనువు పెరగడంతో ‘సీక్రెట్’ అప్లికేషన్‌ ద్వారా రూపొందించిన ఫిషింగ్‌ లింక్‌ను పంపించాడు. అది ఫిషింగ్‌ లింక్‌ అని తెలియని అవతలి వ్యక్తి దానిపై క్లిక్‌ చేశాడు. అంతే…

మునీర్‌.. సదరు అపరిచితుడి ఫేస్‌బుక్‌ ఖాతాలోకి చొరబడ్డాడు. యూజర్‌నేమ్‌, పాస్‌వర్డ్‌ తెలుసుకొని వాటిని మార్చేశాడు. బ్యాంకు ఖాతా వివరాలనూ కొట్టేసి బెదిరించడం ఆరంభించాడు. వ్యక్తిగత వివరాలను అంతర్జాలంలో అప్‌లోడ్‌ చేస్తానని..చెప్పడంతో బాధితుడు రాచకొండ సైబర్‌క్రైమ్‌ పోలీసులను ఆశ్రయించాడు. సైబర్‌క్రైమ్‌ ఇన్‌స్పెక్టర్‌ జలేంధర్‌రెడ్డి కేసు దర్యాప్తు చేపట్టారు. సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా మునీర్‌ నిర్వాకాన్ని గుర్తించారు. ప్రభుత్వోద్యోగి కుటుంబంలో పుట్టిన మునీర్‌ మరికొందరి ఖాతాలనూ హ్యాక్‌ చేసి ఉంటాడని భావించి దర్యాప్తు చేస్తున్నారు. సామాజిక మాధ్యమాల ద్వారా అపరిచితులు పంపించే ఫిషింగ్‌ లింక్‌లను గుడ్డిగా క్లిక్‌ చేసి చిక్కులు కొనితెచ్చుకోవద్దని జలేంధర్‌రెడ్డి సూచించారు.