మొదటి భార్యకు విడాకులివ్వకుండానే మరో మూడు పెళ్లిళ్లు చేసుకొన్నాడు ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు.
ఎవరికి అనుమానం రాకుండా మొత్తం నాలుగు పెళ్లిళ్లు చేసుకున్న ఆ స్కూల్ టీచర్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన ఒడిశాలోని కటక్ జిల్లాలో వెలుగు చూసింది.
45 ఏండ్ల వయసున్న వ్యక్తి వృత్తిరీత్యా ప్రభుత్వ టీచర్. ఆయనకు తొలిసారి 2001లో వివాహమైంది. ఆమెతో సంసారం చేస్తూనే.. 2009లో మరో మహిళను పెళ్లి చేసుకున్నాడు.
ఈ విషయం మొదటి భార్యకు తెలియకుండా దాచాడు. రెండో భార్యతో మూడేండ్లు సంసారం చేసిన తర్వాత ఆమె వద్ద ఉన్న బంగారు ఆభరణాలు, ఇతర ఖరీదైన వస్తువులను దొంగిలించాడు.
మొత్తానికి రెండో భార్య ఫిర్యాదుతో పోలీసులు విచారణ చేపట్టి.. ఆ వస్తువులను టీచర్ నుంచి తిరిగి ఇప్పించారు.
లాక్‌డౌన్ లో ఆ టీచర్ మరో రెండు వివాహాలు చేసుకున్నాడు. మొదటి ఇద్దరు భార్యలకు విడాకులివ్వకుండానే మరో ఇద్దరిని పెళ్లి చేసుకున్నాడు.
ఆయనకు ఇప్పటికే పెళ్లి అయినట్లు వీరికి కూడా తెలియదు. మొత్తం నాలుగు పెళ్లిళ్లు చేసుకొని ఎలాంటి అనుమానం రాకుండా మెయింటెన్ చేశాడు.
తమ భర్త లాక్‌డౌన్‌లో మరో ఇద్దరిని వివాహం చేసుకున్నాడని మొదటి ఇద్దరు భార్యలు తెలుసుకున్నారు.
దీంతో వారు కటక్‌లోని మహిళా పోలీసు స్టేషన్‌లో గత నెలలో ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు టీచర్‌ను అరెస్టు చేశారు.