ఆత్మీయులను కోల్పోయి అంతు లేని దుఃఖంలో ఉన్న వారికి ప్రశాంతంగా అంతిమయాత్ర నిర్వహించేందుకు ఓ స్వచ్ఛంద సంస్థ ఏర్పాటు చేసిన వైకుంఠ రథం ఎంతో మందికి సాంత్వన చేకూరుస్తోంది. పేద మధ్యతరగతి వారితో పాటు మతాలకతీతంగా ఆసరా స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులు రామగుండం ప్రాంతంలో ఉచిత సేవలందిస్తూ స్ఫూర్తి నింపుతున్నారు.
నిరుపేద కుటుంబాలకు అండ
మనకు తెలియని వారు చనిపోయినా శవయాత్రలో పాల్గొంటే ఎంతో పుణ్యం వస్తుందంటారు. కానీ అంతిమయాత్రకు ఉచితంగా వైకుంఠ రథాన్ని ఏర్పాటు చేయడం ద్వారా ఆయన ఎంతో మందికి సేవలందిస్తున్నారు. ఇంట్లో ఒక మనిషి చనిపోతే దహన సంస్కారాలు నిర్వహించలేని ఎన్నో నిరుపేద కుటుంబాలున్నాయి. కనీసం శ్మశానవాటిక వరకు కూడా మృతదేహాన్ని తీసుకెళ్లే స్థోమత లేని కుటుంబాలున్నాయి. అలాంటి వారి కోసం వైకుంఠ రథమ్ పేరు తో ఒక వాహనాన్ని ఏర్పాటు చేసి ఉచితంగా అంతిమయాత్రకు అందజేయాలని సంకల్పించారు గోదావరిఖనికి చెందిన ఆసరా స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకులు పెంట రాజేశ్. రూ.5 లక్షలతో వాహనాన్ని కొనుగోలు చేసి మృతదేహాన్ని అంతిమ యాత్రకు తరలించే విధంగా తయారు చేయించారు. ఇందుకోసం డ్రైవర్‌ను ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. గోదావరిఖనికి చెందిన ఈ వాహనం కోసం 83414-00001 ఈ నెంబరుకు ఫోన్ చేస్తే చాలు సదరు చిరునామా వద్దకు చేరుకుని పార్ధివ దేహాన్ని శ్మశానవాటిక వరకు తీసుకెళ్లే సదుపాయాన్ని కల్పించారు. ఈ వాహనాన్ని ఎన్నో కుటుంబాలు వినియోగించుకుంటున్నాయి. ఒక్కో రోజు రెండు నుంచి ముగ్గురు మరణించినా వాటిని తీసుకెళ్లేందుకు నిరంతరం అందుబాటులో ఉండేలా ఏర్పాటు చేశారు.
నిర్వహణ ఖర్చులు భరిస్తూ
2016 ఏప్రిల్ 14న గోదావరిఖని ప్రాంతంలో వైకుంఠ రథం సేవలు ప్రారంభించారు. రూ.5 లక్షలతో కొనుగోలు చేసిన వాహనం నడిపేందుకు స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులు డ్రైవర్‌కు రూ.6000 చొప్పున వేతనాన్ని చెల్లిస్తున్నారు. వాహనం నడిచేందుకు డీజిల్‌తో పాటు నిర్వహణ ఖర్చు కూడా నిర్వాహకులే చూసుకుంటారు. కేవలం చరవాణికి ఫోన్ వస్తే చాలు ఆ అడ్రస్‌కు చేరిపోయే వైకుంఠ రథం ఇప్పటివరకు 1152 పార్థివ దేహాలను శ్మశానవాటికకు తరలించింది. అంతిమయాత్ర సమయంలో బంధువులు మృతదేహం పక్కనే కూర్చునేలా ఇరువైపులా చెక్క బల్లలను ఏర్పాటు చేశారు. మృతదేహంతో వాహనం బయలుదేరిన వెంటనే భగవద్గీత శ్లోకాలతో ప్రశాంతంగా అంతిమయాత్రకు తీసుకెళ్లే వాతావరణాన్ని కల్పించారు.
ఆ సంఘటనే కదిలించింది
మహారాష్ట్రలోని షోలాపూర్‌లో ఓ సంఘటన నన్ను కలచివేసింది. ఓ వ్యక్తి చనిపోతే అంతిమ యాత్రకు తీసుకెళ్లడానికి ఆ కుటుంబం వద్ద డబ్బులు లేవు. వారు పడ్డ కష్టాన్ని చూసిన తర్వాత మన ప్రాంతంలో పేద వారికి అలాంటి పరిస్థితి ఎదురు కాకూడదని భావించాను. సొంతంగా రూ.5 లక్షలతో వాహనం కొనుగోలు చేసి వైకుంఠ రథంగా ఏర్పాటు చేశాను. ఇది ఎంతో మందికి పేదలకు ఉపయోగపడుతోంది. ఆసరా స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా ఖర్చు లేకుండా వైకుంఠ రథాన్ని ఏర్పాటు చేయడం ఎంతో సంతృప్తినిస్తోంది అని ఆసరా స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకుడు పెంట రాజేశ్ తెలియజేశారు.