నగరంలో నయా ట్రెండ్‌.. నడిచొచ్చే ఇల్లు

640

సొంతింటి కలను నెరవేర్చుకోవాలంటే ఈ మహానగరంలో ఎంత కష్టమో అందరికీ ఎరుకే. సొంత స్థలం ఉన్నా సరే అనుమతుల కోసం అధికారుల చుట్టూ కాళ్లరిగేలా తిరగాలి. ఎంతోమంది చేతులు తడపాలి. అన్నీ లెక్కేసుకుంటే వ్యక్తిగత ఇల్లు పూర్తయ్యేసరికి రూ.కోటి దాటడం ఖాయం. ఇక అపార్ట్‌మెంట్‌లో ఫ్లాట్‌ తీసుకుంటే నగర శివార్లలో కూడా రూ.60 లక్షలకు పైనే ఉంది. అలాంటిది రూ.12 లక్షలకే డుప్లెక్స్‌ ఇల్లు వచ్చేస్తే..! పైగా దాన్ని మనం ఎక్కడికంటే అక్కడికి తీసుకువెళ్లిపోయే అవకాశం ఉంటే..!! ఇలాంటి ఇళ్లు నగరంలో వెలుస్తున్నాయి. ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఆర్డర్లు ఇచ్చి మరీ వెంట తీసుకుపోతున్నారు. కదిలే ఇళ్లని క్వాలిటీ తక్కువగా అంచనా వేయొద్దు.. కనీసం ముప్పై ఏళ్లు గ్యారంటీ అండోయ్‌.

సుభాష్‌నగర్‌: మన అవసరాలకు అనుగుణంగా ఇల్లు కూడా మనతో పాటే వచ్చేస్తే ఎలా ఉంటుంది? ఇలాంటి ఆలోచన విదేశాల్లో ఏనాడో వచ్చింది. అందుకే అక్కడివారు కదిలే ఇళ్లను నిర్మించుకుంటారు. ఇలాంటి ఇళ్లు ఇప్పుడు నగరంలోనూ వచ్చేశాయండోయ్‌! ఇక్కడ డబుల్‌ బెడ్రూం ఇల్లు కట్టాలంటే కనీసం రూ.కోటి ఖర్చు పెట్టాల్సిందే. ఒకవేళ అపార్ట్‌మెంట్‌లో ఫ్లాట్‌ తీసుకుంటే కనీసం రూ.70 లక్షలు చెల్లించాలి. అలాంటిది అన్ని సౌకర్యాలతో రూ.10 లక్షల లోపే ఇల్లు వచ్చేసిందే అనుకోండి.. సామాన్యుడికి అంతకంటే కావాల్సింది ఇంకేముంటుంది! అద్దె ఇంటి కష్టాలు తెలిసిన ఓ వ్యక్తి చేసిన ప్రయోగంవిజయవంతమైంది. ఇంట్లోని సామానులే కాదు.. కావాల్సిన చోటుకి తీసుకుపోయే ఇళ్లను హైదరాబాద్‌లోనే నిర్మిస్తున్నారు. వాటిని చూడాలన్నా, కొనుగోలు చేయాలన్నాఒక్కసారి దూలపల్లికి వెళ్లి రావాల్సిందే.

గుంటూరు జిల్లా నిజాంపట్నం ప్రాంతానికి చెందిన ఎస్‌కే జిలానీ మెకానికల్‌ ఇంజినీరింగ్‌ పూర్తి చేశారు. దూలపల్లిలో ఫ్యాబ్రికేషన్‌ పనులతో పాటు క్రేన్ల మరమ్మతులు నిర్వహిస్తున్నారు. కొన్నేళ్ల క్రితం జిలానీ విదేశాలకు వెళ్లినపుడు అక్కడ మొబైల్‌ హౌస్‌ అతడిని బాగా ఆకర్షించింది. అంతర్జాతీయ పోకడలను వేగంగా అందిపుచ్చుకునే హైదరాబాద్‌లోనూ ఇలాంటి ఇళ్లు కడితే బాగుంటుందన్న ఆలోచనతో ఆ దిశగా అడుగులు వేశారు. ఆరు నెలల క్రితం దూలపల్లిలో క్రేన్‌ సహాయంతో సులభంగా తరలించే ఫ్యాబ్రికేటెడ్‌ మొబైల్‌ హౌస్‌ల నిర్మాణం చేపట్టారు. మొదటిది విజయంతం కావడంతో ఇప్పటికి ఇరవై మొబైల్‌ హౌస్‌లను నిర్మించి విక్రయించారు. మరో పదిహేను ఇళ్లకు ఆర్డర్‌ రావడంతో వాటి రూపకల్పనలో బిజీగా మారాడు జిలానీ.

ఎంతో ప్రత్యేకం మొబైల్‌ ఇల్లు

కొనుగోలుదారుల ఆసక్తి, అభిరుచికి తగ్గట్టు సౌకర్యాలను బట్టి ఈ ఇళ్లను నిర్మిస్తున్నారు. 200 చ.అడుగుల నుంచి 800 చ.అడుగల వరకు ఇవి ఉంటున్నాయి. నిర్మాణంలో ఇనుము, కలప వినియోగిస్తున్నారు. ఇందులో సింగిల్, డబుల్‌ బెడ్రూం, డూప్లెక్స్, విల్లా తరహాల్లో కదిలే ఇళ్లను కొనుగోలుదారుల అభిరుచులకు అనుగూణంగా సకల సౌకర్యాలతో అందిస్తున్నారు. పడక గది, వంట గది, హాలు, పెంట్‌ హౌస్, ఇంట్లో నుంచి మెట్లు, ఇంటిపై వాటర్‌ ట్యాంక్, బాత్‌రూమ్, వాష్‌ బేసిన్‌.. వాటికి అనుసంధానంగా డ్రైనేజీ పైపులు ఏర్పాటు చేస్తారు. గోడల మధ్యనే కరెంట్‌ తీగలను అమరుస్తారు. ఇనుప గోడలు కనుక ఒకవేళ విద్యుత్‌ షార్ట్‌ సర్క్యూట్‌ కాకుండా వెంటనే కరెంట్‌ నిలిచిపోయే టెక్నాలజీని వినియోగిస్తున్నారు. సుమారు 30 ఏళ్ల మన్నిక గల ఈ ఇళ్ల ధర ఆర్డర్‌ చేసిన విస్తీర్ణం, సౌకర్యాలను బట్టి కనిష్టంగా రూ.4 లక్షల నుంచి రూ.12 లక్షల వరకు ఉంది. అంతే కాకుండా వాస్తు ప్రకారంగా ఇంటిని అందించడం విశేషం. ఒక్కో ఇంటి బరువు 3.5 టన్నుల నుంచి 6 టన్నుల వరకు ఉంది. వీటిని క్రేన్‌ సహాయంతో ఒకచోటు నుంచి మరో చోటుకు కంటైనర్లు, లారీల్లో తీసుకుపోవచ్చు.

ఫామ్‌హౌస్, గెస్ట్‌హౌస్, రిసార్ట్, రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం, కంపెనీ ప్రాజెక్ట్‌లోపనిచేసే ఇంజినీర్లు, చేపల చెరువులు, వ్యవసాయ క్షేత్రాల వద్ద, పార్కులు వద్ద నివసించే వారు ఎక్కువగా ఈ మొబైల్‌ హౌస్‌లను కొనుగోలుచేస్తున్నారు

విజయవంతం చేశా..

విదేశాల్లో ఈ మొబైల్‌హౌస్‌లను చూశాను. మన దేశంలో కూడా ఇలాంటివి నిర్మించాలని ఆలోచన వచ్చింది. క్రేన్‌ల మరమ్మతుల వ్యాపారం చేస్తునే మొబైల్‌ హౌస్‌ డిజైన్‌ ప్రారంభించాను. ఇప్పటికి ఇరవై ఇళ్లను విక్రయించాను. ప్రస్తుతం చాలా అర్డర్లు వచ్చాయి.శిల్పారామంలో కూడా 525 చదరపు అడుగుల్లో మొబైల్‌ హౌస్‌ను నిర్మించి ఇచ్చాం. ఒక్కో ఇంటి తయారీకి 45 రోజుల సమయం పడుతుంది.– ఎస్‌కే జిలానీ,మొబైల్‌ హౌస్‌ నిర్మాణదారుడు

దేశంలో మొట్టమొదటిగా..

మనదేశంలో ఇప్పటి దాకా కంటైనర్లలో గదులను నిర్మించి ఇళ్లుగా వినియోగిస్తున్నారు. కానీ దూలపల్లిలో మాత్రం అమెరికా, యూకే, రష్యా, జపాన్‌ దేశాల్లో ఉన్నట్టు.. అంతే నాణ్యతతో కాంక్రీట్‌ ఇళ్లకు ఏమాత్రం తీసిపోని విధంగా ఈ మొబైల్‌ హౌస్‌లను అన్ని హంగులతో నిర్మించి ఇస్తున్నారు. ఇలాంటి ఇళ్ల నిర్మాణం చేపట్టడం దేశంలో ఇక్కడే తొలిసారి కావడం విశేషం.

మొబైల్‌హౌస్‌కావాలనుకునే వారు 95500 11786, 98498 90786 నంబర్లలోసంప్రదించవచ్చు.