సీఎం కేసీఆర్‌పై ఈడీ నిఘా?

168

తెలంగాణ ముఖ్య‌మంత్రి కె. చంద్ర‌శేఖ‌ర్ రావుపై బీజీపీ బండి సంజ‌య్ సంచ‌ల‌న కామెంట్స్ తెలిసిందే. అయితే తెలంగాణలో అవినీతిపరులు ఫామ్‌హౌజ్‌లలో దాక్కున్నా వదిలేది లేదని క‌పిల‌వాయి దిలీప్‌కుమార్ మ‌రో సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.

సీఎంపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ నిఘా పెట్టిందని ఆయ‌న అన్నారు. ఏ క్షణాన్నైనా రైడ్స్ జరగొచ్చంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

బండి సంజయ్ దౌత్యంతో బీజేపీలో చేరిన మాజీ ఎమ్మెల్సీ కపిలవాయి దిలీప్‌కుమార్. తన ఎమ్మెల్సీ నామినేషన్‌ను ఉపసంహరించుకునేందుకు జీహెచ్‌ఎంసీ కార్యాలయానికి వచ్చారు.

అనంతరం దిలీప్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ హైదరాబాద్ రంగారెడ్డి మహబూబ్‌నగర్ పట్టభద్రుల నియోజకవర్గానికి వేసిన నామినేషన్‌ను ఉపసంహరించుకుంటున్నట్లు చెప్పారు.

బీజేపీ నుంచి పోటీ చేస్తున్న రాంచందర్ రావుకి మద్దతిస్తున్నట్లు ప్రకటించారు. రామ్‌చందర్‌ను గెలిపించాలని అయన కోరారు.

బండి సంజయ్ ఆఫీసుకు వచ్చి విత్ డ్రా చేసుకోమని కోరడంతో నామినేషన్ ఉపసంహరించుకుని బీజేపీలో చేరినట్లు చెప్పారు.

ఈ సందర్భంగా ఆయన సీఎం కేసీఆర్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు.

సీఎం కుటిల రాజకీయవేత్తని తీవ్ర విమర్శలు చేశారు. కేసీఆర్ ఎలాంటి గేమ్స్ ఆడతాడో రాజకీయ అవగాహన లేని వారికి కూడా తెలుసన్నారు.

మాజీ ప్రధాని పీవీని తాను, కేసీఆర్‌ ఢిల్లీలో కలిశామని.. అప్పుడే ఆయన్ను సమైక్యవాది అని కేసీఆర్ అన్నారని దిలీప్ కుమార్ తెలిపారు.

అలాంటి కేసీఆర్‌కి ఈ రోజు పీవీ జ్ఞాపకం రావడం రాజకీయమేనన్నారు.

పీవీ కుమార్తె వాణి అభ్యర్థిత్వంతో కుల పంచాయతీ పెట్టాలని.. బ్రాహ్మణ ఓట్లు దండుకుందామని చూస్తున్నారంటూ ఆయన మండిపడ్డారు.

సీఎం కేసీఆర్‌కు ఏనాడూ పీవీ ప్రేమ లేదని.. ఈ ఎన్నికల్లో వాణి బలిపశువు కాబోతోందని దిలీప్ అన్నారు.

సీఎం చెప్పేదంతా అరచేతిలో స్వర్గమేనని.. అందరిని మోసం చేసేందుకే వాణిని అభ్యర్థిగా ప్రకటించారని ఆయన ఆరోపించారు.

అవకాశం ఉంటే ఆమె కూడా వచ్చి 3 గంటల్లోపు నామినేషన్ విత్ డ్రా చేసుకోవాలని కోరారు.

ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు ఎవరికి అవకాశం వచ్చినా వినియోగించుకోవాలన్నారు.

సీఎం మాయమాటలకు లొంగొద్దని గ్రాడ్యుయేట్స్‌కు అప్పీల్ చేశారు. కేసీఆర్ ప్రభుత్వం ఎక్కువ రోజులు ఉండదంటూ దిలీప్ జోస్యం చెప్పారు.

సీఎం కేసీఆర్ సంపాదన ముఖేష్ అంబానీ తమ్ముడు అనిల్ అంబానీ కన్నా ఎక్కువని అన్నారు.

ఆ డబ్బుల జాబితా అంతా ఎన్‌ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్(ఈడీ) రెడీగా పెట్టుకుందంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు.

ఈడీ సిద్ధంగా ఉందని ఢిల్లీలో ఏ రోజు సీఎంపై రైడ్స్ మొదలవుతాయో చెప్ప‌లేమ‌ని అన్నారు. ఈడీ సీఎం కోటరీ చుట్టూ రైడ్స్ చేసే అవకాశం ఉందని చెప్పారు.

ఈ సర్కార్ కూలిపోతుందంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. నిన్న బండి సంజయ్.. నేడు దిలీప్‌కుమార్ వ్యాఖ్యలతో ఏం జరుగుతుందోనన్న ఉత్కంఠ నెల‌కొంది.