ఎవరీ మసూద్‌ అజర్‌?

347
Ajad

జైషే ఉగ్రవాద సంస్థ అధిపతి మసూద్‌ అజర్‌.. పాకిస్థాన్‌ పంజాబ్‌ ప్రావిన్స్‌లోని భవహాల్‌పూర్‌లో 1968లో జన్మించాడు. అజర్‌ తండ్రి అల్లా షబ్బీర్‌ ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయుడిగా పని చేసి పదవీ విరమణ పొందాడు. వీరి కుటుంబం పాల వ్యాపారం చేస్తూ.. కోళ్ల పెంపకం చేసేవారు. మసూద్‌ అజర్‌ 1989లో డిగ్రీ పట్టా పొందారు. ఆ తర్వాత స్కూల్‌ టీచర్‌గా కొన్నాళ్ల పాటు సేవలందించారు.

1994లో పోర్చుగీస్‌ పాస్‌పోర్టుతో జమ్మూకశ్మీర్‌లోకి ప్రవేశించాడు మసూద్‌. జమ్మూకశ్మీర్‌లో కొన్ని ఉగ్రవాద సంస్థలతో అజర్‌ పరిచయాలు ఏర్పరుచుకున్నాడు. ఉగ్రవాద కార్యకలాపాలు నిర్వహిస్తున్న అజర్‌ను 1994లో పోలీసులు అరెస్టు చేసి జైలుకు తరలించారు. తనను ఎక్కువ కాలం జైలులో ఉంచలేరు అని అధికారులతో మసూద్‌ అనేవారట. అయితే జైలు నుంచి తప్పించుకునేందుకు మసూద్‌ అజర్‌తో పాటు మరికొందరు ఉగ్రవాదులు.. పెద్ద సొరంగం తవ్వి పారిపోయేందుకు ప్రయత్నించారు. తానే మొదట సొరంగం ద్వారా వెళ్తానని తన ప్రయత్నం మొదలుపెట్టాడు మసూద్‌. కానీ ఆయన కాస్త లావుగా ఉండటంతో ఆ సొరంగం మధ్యలోనే ఇరుక్కుపోయి.. మళ్లీ వెనుదిరిగాడు. మొత్తానికి అజర్‌ చేసిన ప్లాన్‌ బెడిసికొట్టింది.

ఆ తర్వాత 1999లో ఖాట్మండు నుంచి ఢిల్లీకి వస్తున్న ఎయిర్‌లైన్స్‌ విమానాన్ని ఉగ్రవాదులు హైజాక్‌ చేసి కాందహార్‌కు తరలించారు. మసూద్‌ అజర్‌తో పాటు మరో ఇద్దరు ఉగ్రవాదులను విడుదల చేయాలని.. ఉగ్రవాదులు భారత ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. దీంతో ప్రయాణికులను కాపాడుకునేందుకు మసూద్‌తో పాటు మరో ఇద్దరిని నాటి ఏన్డీయే ప్రభుత్వం జైలు నుంచి విడుదల చేసింది. అనంతరం అల్‌ ఖైదా చీఫ్‌ ఒసామా బిన్‌ లాడెన్‌, తాలిబన్‌ అధినేత ముల్లా మహ్మద్‌ ఓమర్‌ను ఆఫ్ఘనిస్థాన్‌లో కలిశారు.




ఆ తర్వాత పాకిస్థాన్‌కు వెళ్లిన మసూద్‌ అజర్‌.. 2000 సంవత్సరంలో జైషే మహ్మద్‌ ఉగ్రవాద సంస్థను ఏర్పాటు చేశాడు. 2001 అక్టోబర్‌లో జమ్మూకశ్మీర్‌ అసెంబ్లీపై జైషే సభ్యులు ఆత్మాహుతి దాడికి పాల్పడంతో 38 మంది ప్రాణాలు కోల్పోయారు. 2001, డిసెంబర్‌ 13న జైషే ముష్కరులు భారత పార్లమెంట్‌పై దాడి చేసి 10 మందిని పొట్టన పెట్టుకున్నారు. ఆ సమయంలో అంతర్జాతీయ ఒత్తిడితో మసూద్‌ అజర్‌ను పాకిస్థాన్‌ గృహ నిర్బంధం చేసింది. అయితే ఆయనకు వ్యతిరేకంగా ఆధారాలు లేవంటూ లాహోర్‌ కోర్టు తీర్పునివ్వడంతో 2002లో విడుదలయ్యాడు. 2016లో పఠాన్‌కోట్‌లోని వైమానిక దళ స్థావరంపై జరిగిన ఉగ్రవాద దాడులకు మసూద్‌ సూత్రధారి. అదే ఏడాదిలో జమ్మూకశ్మీర్‌లోని ఉరీ సైనిక శిబిరంపై జైషే ఉగ్రవాదులు దాడి చేయడంతో 19 మంది భారత సైనికులు ప్రాణాలు కోల్పోయారు.

గతేడాది జులైలో పాకిస్థాన్‌ ఆక్రమిత కశ్మీర్‌లోని ముజఫరాబాద్‌లోని తన మద్దుతదారులను ఉద్దేశించి గుర్తు తెలియని ప్రాంతం నుంచి మసూద్‌ అజర్‌ ఫోన్‌లో మాట్లాడుతూ.. చనిపోయేంత వరకు పోరాడేందుకు తన వద్ద వందల సంఖ్యలో ఉగ్రవాదులు సిద్ధంగా ఉన్నారని తెలిపాడు. దీంతో మరోసారి హైజాక్‌ జరిగే అవకాశం ఉందని ఇండియాలోని విమానాశ్రయాల్లో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. గత నెల 14న పుల్వామా ఉగ్రదాడిలో 40 మంది సీఆర్పీఎఫ్‌ జవాన్లు అమరులయ్యారు. ఈ దాడులకు తామే బాధ్యత వహిస్తున్నట్లు జైషే మహ్మద్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే.