బస్సు ప్రయాణికులే టార్గెట్..

227
Traffic

రద్దీగా ఉన్న ఆర్టీసీ బస్సులే వీరి టార్గెట్. సాదారణ ప్రయాణికుల్లా బస్సులోకి ఎక్కి మూడో కంటికి తెలియకుండానే బంగారు గొలుసులు అపహరిస్తారు. తొమ్మిది మంది ముఠా సభ్యుల్లో సైఫాబాద్ పోలీసులు ఐదుగురిని అరెస్టు చేయగా, మరో నలుగురిని పట్టుకోవాల్సి ఉంది. నిందితుల్లో ఒకడు పీడీ యాక్ట్ నేరస్తుడు. మాంగార్‌బస్తీకి చెందిన ఈ చైన్ గ్యాంగ్ వివరాలను సైఫాబాద్ ఏసీపీ వేణుగోపాల్ రెడ్డి, డీఐ నర్సింహులు, ఎస్సై ప్రసాద్‌తో కలిసి మీడియాకు వివరించారు.

మల్లేపల్లిలోని మంగార్‌బస్తీకి చెందిన కాంబ్లే శ్యాంసుందర్ అలియాస్ శ్యామ్ (24) గ్యాంగ్‌లీడర్. ఇతని చేతికింద మరో ఎనిమిది మంది ముఠా సభ్యులుగా పనిచేస్తారు. ఆర్టీసీ బస్సులో ఈ తొమ్మిది ప్రయాణిస్తూ ప్రయాణికులను దోచుకుంటారు. పలు పోలీస్ స్టేషన్లలో వీరిపై అనేక ఫిర్యాదులు ఉన్నాయి. శనివారం లక్డీకాపూల్ వద్ద బస్సు స్టాప్ వద్ద వేచి ఉన్న ఈ ముఠా సభ్యుల్లో ఐదుగురు నిందితులను సీసీటీవీ ఫుటేజీల ద్వారా గుర్తించిన పోలీసులు చాకచక్యంగా వారిని అదుపులోకి తీసుకున్నారు.

 
అరెస్ట్ అయిన వారిలో మంగారిబస్తీకి చెందిన కాంబ్లే శ్యాంసుందర్‌తో పాటు కాంబ్లే దరశర్ అలియాస్ రాజు (27), కాంబ్లే లక్కీ (20), బి. సాయికుమార్ (19), అరుణ్ రాజ్ గీతా భరత్ (19)లు ఉన్నారు. కాగా శ్యాంసుందర్‌పై అబిడ్స్, హబీబ్‌నగర్, హుమాయున్‌నగర్, మలక్‌పేట్, నల్లకుంట, నారాయణగూడ, సైఫాబాద్, షాహినాథ్ గంజ్,ఎస్‌ఆర్‌నగర్, సుల్తాన్ బజార్ పోలీసు స్టేషన్లలో 22 కేసులున్నాయి. దీంతో అతనిపై గతంలో పీడీ యాక్ట్ నమోదు చేశారు.

మాసబ్‌ట్యాంక్ అడ్డా…

ముఠా నాయకుడు శ్యాంసుందర్ నేతృత్వంలో ఎనిమిది మంది సభ్యులు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణిస్తారు. మెడలో బంగారు గొలుసు వేసుకుంటే అతని వెనుక ముగ్గురు, ముందు మరో ముగ్గురు, ఫుట్‌బోర్డుపై మరో ముగ్గురు నిలబడి ఏమారుపాటుకు గురిచేస్తారు. వెనుక, ముందు నిలబడ్డవారు ఎంచుకున్న వ్యక్తిని అటకాయించి శ్యాంసుందర్ తన పంటితో బాధితుడికి తెలియకుండా గొలుసును తెంపివేస్తాడు. ముందు ఉన్న వారిలో ఒకరు ఆ గొలుసును తస్కరిస్తారు. ఇలా దొంగతనం చేసిన బంగారు ఆభరణాలను మహారాష్ట్ర, కర్నాటకలో విక్రయిస్తారు. బాధితుల నుంచి వచ్చినఫిర్యాదుల మేరకు దర్యాప్తు చేస్తున్న పోలీసులు వీరిలో ఐదుగురిని ఎట్టకేలకు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రూ.2,22,500 విలువైనబంగారు ఆభరణాలను రికవరి చేశారు.