ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం శుక్రవారం ప్రకటించింది. ఇందులో ఒక కేంద్ర పాలిత ప్రాంతం, నాలుగు రాష్ట్రాలు ఉన్నాయి.
మే, జూన్‌లలో నాలుగు రాష్ట్రాల (పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు, అసోం) అసెంబ్లీల గడువు ముగియనుంది. 126 స్థానాలున్న అసోం అసెంబ్లీ గడువు మే-31తో ముగుస్తుంది.
294 అసెంబ్లీ స్థానాలున్న పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ గడువు మే-30తో, 234స్థానాలున్న తమిళనాడు అసెంబ్లీ గడువు మే-24తో, 140స్థానాలున్న కేరళ అసెంబ్లీ గడువు జూన్-1తో ముగియనున్నాయి.
కొద్ది రోజుల క్రితం పుదుచ్చేరిలో వి నారాయణస్వామి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం విశ్వాస పరీక్షలో ఓడిపోవడంతో అక్కడ ప్రస్తుతం రాష్ట్రపతి పాలన కొనసాగుతోంది.
ఈ నేపథ్యంలో ఢిల్లీలోని విజ్ణాన్ భవన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సీఈసీ సునీల్ అరోరా నాలుగు రాష్ట్రాలకు, కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరి అసెంబ్లీకి ఎన్నికల తేదీలను ప్రకటించారు.
అసోంలో మూడు దశల్లో ఎన్నికలు నిర్వహించనున్నట్లు చెప్పారు. తమిళనాడు, కేరళ, పుదుచ్చేరిలలో ఒక దశలోనే ఎన్నికలు పూర్తవుతాయని తెలిపారు.
పశ్చిమ బెంగాల్‌లో ఎనిమిది దశల్లో ఎన్నికలు నిర్వహించనున్నట్లు చెప్పారు. నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతంతో కలిపి మొత్తంగా 824 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరుగనుంది.
18.68 కోట్ల ఓటర్లు 2.7 లక్షల పోలింగ్ కేంద్రాల్లో తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారని సీఈసీ తెలిపారు.
బెంగాల్‌కు మాత్రమే కాకుండా పోలింగ్ జరుగనున్న అన్ని రాష్ట్రాలకు అవరమైన మేర కేంద్ర సాయుధ బలగాలను (CAPF) పంపనున్నట్టు చెప్పారు.
క్రిటికల్, ప్రమాదకరమైనది అనుకున్న పోలింగ్ స్టేషన్‌లను గుర్తించడం జరిగిందన్నారు. తగినంత సంఖ్యలో CAPFను రంగంలోకి దించనున్నట్లు చెప్పారు.
బెంగాల్ లో ఎన్నికల పరిశీలన కోసం ఇద్దరు ప్రత్యేక అధికారులను పంపనున్నట్లు తెలిపారు. కరోనా జాగ్రత్తలతో ఎన్నికలు నిర్వహిస్తామని సునీల్ అరోరా పేర్కొన్నారు.
ఓటర్ల భద్రతకే తొలి ప్రాధాన్యత అని చెప్పారు. కరోనా ఉదృతి తగ్గాక బీహార్ అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించిన విషయాన్ని గుర్తు చేశారు.
కరోనా సంక్షోభంలోనూ ఎన్నికలను విజయవంతంగా నిర్వహించిన అధికారులను ప్రశంసించారు. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన కరోనా యోధులకు నివాళులర్పించారు.
కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఇంటింటికి వెళ్లి ప్రచారం చేయడాన్ని నియంత్రిస్తున్నట్టు సీఈసీ తెలిపారు. అభ్యర్థితో సహా ఐదుగురికి మాత్రమే అనుమతినిస్తున్నట్టు పేర్కొన్నారు.
రోడ్ షోలను ఏర్పాటు చేసుకోవచ్చని స్పష్టం చేశారు. కోవిడ్ జాగ్రత్తలు పాటిస్తూ రోడ్ షోలు నిర్వహించాలని చెప్పారు. స్థానిక అధికారుల నిర్ణయం మేరకు రోడ్ షోలకు అనుమతి ఉంటుందన్నారు.
ఈసారి అభ్యర్థులు..ఆన్ లైన్ లో నామినేషన్లు వేసేందుకు అనుమతి ఇస్తున్నట్లు చెప్పారు. ఈసారి ఓటింగ్ సమయాన్ని గంట పెంచుతున్నట్లు చెప్పారు.
కేవలం సీనియర్ సిటిజన్లు, అనారోగ్యవంతులు, అత్యవసర విభాగాల్లో పనిచేసే వారికి మాత్రమే పోస్టల్ బ్యాలెట్ ఉపయోగించుకునే అవకాశమిస్తున్నట్లు చెప్పారు.
ఎన్నికలకు ముందే సిబ్బందికి కరోనా వ్యాక్సిన్ ఇవ్వనున్నట్లు చెప్పారు. ప్రధాన ఎన్నికల అధికారిగా ఏప్రిల్ 13న సునీల్ అరోరా పదవీకాలం ముగియనుంది.
దేశంలో ఎన్నికల షెడ్యూల్ విడుదల కోసం తనకు ఇదే చివరి మీడియా సమావేశమన్నారు. ఈ నేపథ్యంలో మీడియాకు అరోరా ధన్యవాదాలు తెలిపారు.
అసోం ఎలక్షన్ షెడ్యూల్
అసెంబ్లీ స్థానాలు-126
ఎన్నికల నోటిఫికేషన్ విడుదల తేదీ-మార్చి2
మొదటి దశ పోలింగ్– మార్చి27
రెండో దశ పోలింగ్-ఏప్రిల్ 1
మూడో దశ పోలింగ్-ఏప్రిల్-6
కౌంటింగ్ తేదీ-మే2
కేరళ ఎలక్షన్ షెడ్యూల్
అసెంబ్లీ స్థానాలు-140
పోలింగ్ తేదీ-ఏప్రిల్6
కౌంటింగ్ తేదీ-మే2
తమిళనాడు ఎలక్షన్ షెడ్యూల్
అసెంబ్లీ స్థానాలు-234
పోలింగ్ తేదీ-ఏప్రిల్ 6
కౌంటింగ్ తేదీ-మే2
పుదుచ్చేరి ఎలక్షన్ షెడ్యూల్
అసెంబ్లీ స్థానాలు-33
పోలింగ్ తేదీ-ఏప్రిల్6
కౌంటింగ్ తేదీ-మే2
బెంగాల్ ఎలక్షన్ షెడ్యూల్
అసెంబ్లీ స్థానాలు-294
మొదటి దశ పోలింగ్– మార్చి27
రెండో దశ పోలింగ్-ఏప్రిల్1
మూడో దశ పోలింగ్-ఏప్రిల్6
నాల్గవ దశ పోలింగ్-ఏప్రిల్10
ఐదవ దశ పోలింగ్-ఏప్రిల్17
ఆరవ దశ పోలింగ్-ఏప్రిల్22
ఏడవ దశ పోలింగ్-ఏప్రిల్26
ఎనిమిదవ దశ పోలింగ్-ఏప్రిల్29
కౌంటింగ్ తేదీ– మే2