
మనిషిలో మానవత్వం మచ్చుకైనా కనబడటం లేదు. కాసుల కక్కుర్తిలో పడి దిగజారిపోతున్నాడు. బంధాలు, అనుబంధాలు ఏమీ లేవు.
డబ్బు కోసం దారుణాలకు ఒడిగడుతున్నాడు. జన్మనిచ్చిన తల్లిదండ్రులను కూడా కడతేర్చేందుకు వెనుకాడటం లేదు.
తాజాగా ఇన్సూరెన్స్ డబ్బు కోసం ఓ కూతురు తన తండ్రినే అడ్డు తొలగించుకుంది.
తండ్రి హత్యలో భర్తకు సహకారం అందించిన అమానుష ఘటన నల్లగొండ జిల్లాలో చోటు చేసుకుంది.
ఇన్సూరెన్స్ ముఠా కిరాతకాలు అందరిని విస్మయానికి గురి చేస్తున్నాయి.
బీమా సొమ్ము కోసం మామను హత్య చేసిన అల్లుడితో పాటు సహకరించిన మృతుడి కుమార్తెను, మరికొందరిని పోలీసులు బుధవారం (మార్చి 10,2021) అరెస్ట్ చేశారు.
నల్గొండ జిల్లా పెద్దవూర మండలం కుంకుడుచెట్టు తండాకు చెందిన బిక్నానాయక్ (45) తన కుమార్తె బుజ్జిని దామరచర్ల మండలం పుట్టలతండాకు చెందిన భాష్యానాయక్‌కు ఇచ్చి పెళ్లిచేశాడు.
2015 ఫిబ్రవరిలో బిక్నానాయక్ రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. గుర్తు తెలియని వాహనం ఢీకొట్టిన కారణంగా మృతిచెందాడని అప్పట్లో కేసు నమోదైంది.
బీమా డబ్బు కోసం హత్య కేసులు వెలుగుచూడడంతో పోలీసులు అనుమానం ఉన్న పాత కేసులను తిరగదోడుతున్నారు.
బిక్నానాయక్ కేసుపై కూడా మళ్లీ విచారణ చేపట్టగా షాకింగ్ నిజం వెలుగుచూసింది. భాష్యానాయకే మామను హతమార్చినట్లు తేలింది.
తన భార్య బుజ్జిని నామినీగా పెట్టి మామ బిక్నానాయక్‌పై భాష్యానాయక్ పలు పాలసీలు చేయించాడు.
ఒక రోజున మామకు మద్యం తాగించి హత్యచేశాడు. తర్వాత రవి, రాజేశ్వర్‌రావు, నరేష్‌తో కలిసి ట్రాక్టర్‌తో తొక్కించాడు.
గుర్తుతెలియని వాహనం ఢీకొట్టిందంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
దాని ఆధారంగా మూడు ఇన్సూరెన్స్ కంపెనీల్లో ఐదు పాలసీల ద్వారా రూ. 79.65 లక్షలు తీసుకున్నాడని పోలీసులు వివరించారు.
నిందితులైన భాష్యానాయక్, రవి, రాజేశ్వరరావు, నరేష్, బుజ్జిని అరెస్టు చేసి రిమాండ్‌కు పంపారు.
ఇందులో బీమా ఏజెంట్ల ప్రమేయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు.