అమ్మను ఉరి తీయమని డిమాండ్‌ చేస్తున్న పిల్లలు..!

350

వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్న భర్తను భార్య హత్య చేసి అనంతరం ఇద్దరు పిల్లలను తన తండ్రి వద్ద వదిలి పెట్టి ప్రియుడితో వెళ్లిపోయింది. మా నాన్నను చంపిన అమ్మను ఉరి తీయాలని ఆమె ఇద్దరు పిల్లలు డిమాండ్‌ చేస్తున్నారు. ఈ సంఘటన పంజాబ్‌లోని తర్న్‌ తరణ్‌ గ్రామంలో ఆదివారం రాత్రి చోటు చేసుకోగా ఆలస్యంగా వెలుగు చూసింది. రాజ్‌ప్రీత్‌ సింగ్‌, సిమ్రాన్‌ కౌర్‌కు 12 ఏళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు.

గత కొంత కాలం నుంచి సిమ్రాన్‌.. లవ్‌ప్రీత్‌ సింగ్‌తో వివాహేతర సంబంధం కొనసాగిస్తుంది. ఈ విషయంలో పలుమార్లు రాజ్‌ప్రీత్‌, సిమ్రాన్‌ మధ్య గొడవలు చోటు చేసుకున్నాయి. ఈ వివాహేతర సంబంధాన్ని అడ్డుకునేందుకు సిమ్రాన్‌ తల్లిదండ్రులు కూడా ప్రయత్నించారు. పిల్లల భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకోవాలని సిమ్రాన్‌కు నచ్చజెప్పినప్పటికీ ఆమె ప్రవర్తనలో మార్పు రాలేదు.

సిమ్రాన్‌ ఆదివారం రాత్రి రాజ్‌ప్రీత్‌కు ఆహారంలో విషమిచ్చింది. అయినప్పటికీ అతను కొనఊపిరితో ఉండడంతో ఉరేసి చంపేసింది. ఆ తర్వాత ఇద్దరు పిల్లలను తీసుకొని తన తండ్రి వద్దకు వెళ్లి అక్కడి విడిచిపెట్టింది. అనంతరం తన ప్రియుడితో కలిసి వెళ్లిపోయింది . జరిగిన విషయాన్ని ఆ ఇద్దరు పిల్లలు తన తాతకు చెప్పారు. నాన్నను ఉరేసి చంపిందని, అమ్మపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆ పిల్లలు డిమాండ్‌ చేశారు. తమ నాన్నను ఎలాగైతే ఉరేసి చంపిందో.. అలాగే అమ్మను కూడా ఉరేయాలని పిల్లలు డిమాండ్‌ చేస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. లవ్‌ప్రీత్‌, సిమ్రాన్‌ ఆచూకీ కోసం గాలిస్తున్నారు.