ఒక్కసారిగా తగ్గిన చికెన్ ధర

342
chicken and eggs price decreased

చికెన్‌ ధరలు తగ్గుముఖం పట్టాయి. వారం రోజుల్లో ఒక్కసారిగా 20 రూపాయలు తగ్గాయి. దీంతో ప్రస్తుతం రిటైల్‌ మార్కెట్‌లో కిలో చికెన్‌ (స్కిన్‌లెస్‌) ధర 150 రూపాయలకు దిగి వచ్చింది. తగ్గింది. సండే వచ్చిందంటే చాలా మంది మాంసం ప్రియలు చెకెన్‌కే ఆసక్తిచూపిస్తుంటారు. గత కొంతకాలంగా కిలో చికెన్‌ ధర రూ.170వద్ద కొనసాగుతుండగా ప్రస్తుతం రూ.20 రూపాయలు తగ్గి 150 రూపాయలకు చేరుకుంది. ప్రస్తుతం హైదరాబాద్‌ నగరంలో రిటైల్‌ వ్యాపారులు స్కిన్‌తో కలిపి కిలో రూ.130లకు, స్కిన్‌లెస్‌ రూ.150 నుంచి 155 రూపాయలకు మధ్య విక్రయిస్తున్నారు. ధరలు తగ్గడంతో జంటనగరాల్లో చికెన్‌ వినియోగం కూడా భారీగానే పెరిగినట్టు వ్యాపారులు పేర్కొంటున్నారు. సాధారణంగా వేసవిలో చికెన్‌ ధరలు తగ్గుముఖం పడతాయి. అయితే ప్రారంభంలోనే ఈస్థాయిలో తగ్గడంతో మరో నెల రోజుల్లో ఇంకా తగ్గే అవకాశం ఉందని వ్యాపారులు అభిప్రాయపడుతున్నారు. ఎండల వేడికి తట్టుకోలేక కోళ్లు మృత్యువాత పడుతుంటాయి. దీంతో ఉత్పత్తికూడా బాగాతగ్గిస్తుంటారు. ధరలు తగ్గడానికి ఇది కూడా ఓ కారణమని పౌల్ర్టీ వ్యాపారులు చెబుతున్నారు. విచిత్రంగా కోళ్ల ఉత్పత్తి తగ్గినా ధరలు కూడా పడిపోవడంతో పౌల్ర్టీ వ్యాపారులు తీవ్రనష్టాలకు గురవుతున్నట్టు తెలిపారు. చికెన్‌ధరలు పడిపోవడంతో జంట నగరాల్లో వినియోగం కూడా బాగా పెరిగింది. హోటళ్లు, క్లబ్బులతో పాటు ఇళ్లలోనూ మాంస ప్రియులు చికెన్‌కే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు.

గత రెండు వారాల్లో జంటనగరాల్లో చికెన్‌ వినియోగం 25శాతం అధికంగా పెరిగిందని పౌల్ర్టీ వ్యాపారి వెంకటేశ్వరరావు వెల్లడించారు. చికెన్‌ ధరలు పెరిగినా కూడా సాధారణ రోజుల్లో గ్రేటర్‌ హైదరాబాద్‌ నగరంలో రోజుకు 35 నుంచి 45 టన్నుల చికెన్‌ వినియోగం ఉంటుందని అన్నారు. ఇక ధరలు తగ్గిన సమయంలో ఇది దాదాపు రెంట్టింపు అవుతోందని ఆయన వెల్లడించారు. హోటళ్లు, బార్లు, క్లబ్బుల్లో చికెన్‌ అమ్మకాలు రెట్టింపు అయినట్టు కూడా వ్యాపారులు చెబుతున్నారు.



కోడిగుడ్ల ధరలూ తగ్గాయి

జంట నగరాల్లో చికెన్‌ ధరలతో పాటు కోడిగుడ్ల ధరలూ తగ్గుముఖం పట్టాయి. వేసవి ఎండలు పెరుగుతున్న నేపఽథ్యంలో హోల్‌సేల్‌ మార్కెట్‌లో కోడిగుడ్ల ధరలూ తగ్గాయి. అయితే రిటైల్‌ వ్యాపారులు మాత్రం యథావిధిగా ఒకగుడ్డును రూ.4.50 నుంచి 5 రూపాయలకు విక్రయిస్తున్నారు. ప్రస్తుతం పౌల్ర్టీఫామ్‌ల వద్ద ఒక గుడ్డు 2.75 రూపాయలు కాగా, హోల్‌సేల్‌ వ్యాపారులు డజన్‌ గుడ్లను 46 రూపాయలకు విక్రయిస్తున్నారు. వినియోగ దారులు నేరుగా హోల్‌సేల్‌ వ్యాపారుల వద్ద కొనుగోలు చేస్తే ఒక గుడ్డ ధర 3.75 రూపాయలకు లభిస్తోంది. కాగా నగరంలో చికెన్‌ తర్వాత అత్యధికంగా వినియోగంలో ఉన్నది కోడిగుడ్లే. అత్యధిక పోషకాలు ఉన్న గుడ్డు సాధారణ ప్రజలు ఎంతో ఇష్టంగా తింటారు. జంటనగరాల్లో గుడ్ల వినియోగం గత రెండు నెలల కాలంలో విపరీతంగా పెరినట్టు పౌల్ర్టీ వ్యాపారులు చెబుతున్నారు. దీనికి కారణం గుడ్డులో ఉన్న పోషక విలువలపై పెద్దయెత్తున ప్రచారం జరగడమే కాగా ప్రస్తుతం కోడిగుడ్ల ఉత్పత్తులు బాగా తగ్గించినట్టు నేషనల్‌ ఎగ్‌ కో-ఆర్డినేషన్‌ కమిటీ (నెక్‌) ఉపాధ్యక్షడు సుబ్బరాజు అభిప్రాయపడ్డారు. సాధారణంగా వేసవిలో గుడ్ల ధరలు తగ్గడంతోపాటు వినియోగం కూడా కొంత తగ్గుతుందని ఆయన అన్నారు. అయితే గత సంవత్సరం కంటే ఈసారి ఉత్పత్తిని వేసవికి ముందే తగ్గించినట్టు తెలిపారు. ప్రస్తుతం పౌల్ర్టీ రంగంలో అనూహ్య పరిస్థితులు నెలకొన్నాయని ఆయన అన్నారు. ఎండలు పెరిగిపోవడం, వివిధ పరీక్షల సమయం కావడంతో కొంత వినియోగం తగ్గుతుందన్నారు. అయితే ఈ పరిస్థితి త్వరలోనే సర్ధుకునే అవకాశం ఉందన్నారు.