కేంద్ర ఉద్యోగులంతా ఇక నుంచి విధులకు వెళ్ళాల్సిందే!

210
central employees Office Attendance Must

కేంద్ర ప్ర‌భుత్వ ఉద్యోగులంతా ఇక నుంచి విధులకు హాజరు కావాల్సిందేనని సిబ్బంది వ్య‌వ‌హారాల మంత్రిత్వ శాఖ స్ప‌ష్టం చేసింది.

ఈ మేరకు ఆ శాఖ నుంచి ఆదేశాలు జారీ అయ్యాయి. దేశంలో క‌రోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో ఈ నిర్ణ‌యం తీసుకున్నారు.

లాక్ డౌన్ అమలులోకి వచ్చిన వేళ, ఉద్యోగులు ఆఫీసులకు హాజరు కాకుండా సడలింపులు ఇచ్చిన సంగతి తెలిసిందే.

ఇప్పుడిక కొత్త కేసుల సంఖ్య కనిష్టానికి పడిపోవడంతోనే కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది.

అయితే కంటైన్మెంట్ జోన్ల‌లో నివాసం ఉంటున్న అధికారులు, ఉద్యోగులకు మాత్రం దీని నుంచి మినహాయింపు ఇచ్చారు.

ఆయా ప్రాంతాలు డీ నోటిఫైడ్ అయ్యేంత వరకూ అక్కడి వారు విధులకు హాజరు కావాల్సిన అవసరం లేదని కేంద్రం ఓ ప్రకటనలో పేర్కొంది.

వీరు అధికారుల నుంచి వచ్చే ఫోన్ కాల్స్ కు అందుబాటులో ఉండాలని సూచించింది. సమావేశాలకు సైతం వీరు వీడియో కాన్ఫరెన్స్ విధానంలో హాజరు కావాలని ఆదేశించింది.

ఇప్పటివరకూ కార్యదర్శి, ఆపై స్థాయి అధికారులు మాత్రమే కార్యాలయాలకు వస్తున్నారన్న సంగతి తెలిసిందే. డిప్యూటీ సెక్రటరీ స్థాయి అధికారులు ఇంటి నుంచే పని చేస్తున్నారు.

ఇక ఆఫీసుల్లో రద్దీ అధికం కాకుండా ఉద్యోగులకు వివిధ రకాల టైమ్ స్లాట్ లను నిర్దారించుకోవాలని సూచింది.  అందరు అధికారులూ వీక్ డేస్ లో ఆఫీసులకు రావాల్సిందేనని కేంద్రం స్పష్టం చేసింది.