తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్‌టీసీ) సరికొత్త ప్రయోగానికి తెరలేపింది. డబ్బులిచ్చి టికెట్ కొనకుండా క్యాష్‌లెస్ టికెట్ వ్యవస్థకు శ్రీకారం చుట్టింది.
ఇందుకోసం ప్రత్యేకంగా రీచార్జ్ చేసుకునే కార్డులను జారీ చేయనుంది. అంటే సెల్‌ఫోన్ రీచార్జ్, మెట్రో రైల్ కార్డు రీచార్జ్ లాంటిది.
డబ్బులు చెల్లించకుండా ఈ కార్డు ద్వారా టికెట్ తీసుకునేలా ఏర్పాట్లు చేస్తున్నారు.
అయితే ముందుగా ప్రయోగాత్మకంగా పరిశీలించేందుకు హైదరాబాద్‌లోని 16వ నంబర్ రూట్‌ను అధికారులు ఎంచుకున్నారు. ఈ రూట్‌లో తిరిగే బస్సులన్నీ దీన్ని అమలు చేస్తాయి.
ఇందులోని లోటుపాట్లను, లాభనష్టాలను బేరీజు వేసిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా దీన్ని అమలు చేయడంపై నిర్ణయం తీసుకుంటారు. ఈ ప్రత్యేక కార్డులను రూ. 30 చెల్లించి కొనాల్సివుంటుంది.
తర్వాత కొంత మొత్తాన్ని టాపప్ చేయించుకోవాలి. ప్రయాణికుడు ఏ స్టేజిలో దిగాలో నమోదు చేసి అతడి వద్ద ఉన్న కార్డులో ఉండే క్యూఆర్ కోడ్‌ను కండక్టర్ స్కాన్ చేయగానే నిర్ధారిత అమౌంట్ కార్డ్ నుంచి డిడక్ట్ అవుతుంది.
ఆ మిషన్ నుంచి టికెట్ వస్తుంది. ఇటీవల వన్ మినీ అనే ప్రైవేటు సంస్థ ఈ కార్డు విషయంలో ఆర్‌టీసీని సంప్రదించినట్టు సమాచారం. దీంతో ఆ ప్రయోగాత్మక పరిశీలన రూట్‌ను ఆ సంస్థకు అప్పగించారు.
సికింద్రాబాద్.. కుషాయ్‌గూడ మధ్య తిరిగే 16వ నంబర్ రూట్ బస్‌లో దీన్ని అమలు చేయనున్నారు.
కార్డును వినియోగించి టికెట్ కంటే నిర్ధారిత బస్సు చార్జీపై 5 శాతం రాయితీ ఇవ్వాలని యోచిస్తున్నారు.
దీంతో ప్రయాణికుడికి కొంత వెసులుబాటు కలగడంతో పాటు నగదు రహిత లావాదేవీలకే ప్రజలు మొగ్గు చూపుతారని అధికారులు భావిస్తున్నారు.