ఓ బాలుడిని దుండగులు అపహరించి అతికిరాతకంగా హత్య చేశారు. ఈ దారుణ ఘటన మహబూబ్‌నగర్ జిల్లా మూసాపేట మండలం జానంపేటలో చోటు చేసుకుంది.
కుటుంబసభ్యుల కథనం ప్రకారం గ్రామానికి చెందిన లక్ష్మి, విష్ణు దంపతులకు సంతోష్ (8) ఉన్నాడు. మూడు రోజుల క్రితం సంతోష్ ఇంటి వద్ద ఆడుకుంటూ అదృశ్యమయ్యాడు.
దీంతో తల్లిదండ్రులు పరిసర ప్రాంతాల్లో గాలించినా ఆచూకీ తెలియలేదు. దీంతో అదే రోజు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు.
గాలింపు చేపట్టిన పోలీసులు జానంపేట సమీపంలోని బావిలో బాలుడి మృతదేహాన్ని గుర్తించారు.
సంతోష్ మృతితో తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. తమ బంధువులే చిన్నారిని హత్య చేసి బావిలో పడేసి ఉంటారని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.