ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్న బర్డ్ ఫ్లూ

274
Bird flu is causing people anxiety

ఏడాది కాలంపాటు కరోనా వైరస్ యావత్తు ప్రపంచానికి కోలుకోలేని విధంగా తీవ్రనష్టాన్ని చేకూర్చింది. ఎంతో ప్రాణనష్టము, మానసికంగా,ఆర్థికంగా ఎన్నో కుటుంబాలను రోడ్డునపడేసింది. ఇంకా ప్రత్యేకంగా చెప్పాలంటే పేద, ధనిక అనే తారతమ్యం లేకుండా హద్దులు దాటిన వారికి తగిన శాస్తి చేసిందని చెప్పడంలో నిజం లేకపోలేదు. ఇప్పటికీ పూర్తిగా ఆ బాధనుండి తేరుకోకమునుపే, ఇప్పుడిప్పుడే ఆ వైరస్ కు మందు కనిపెట్టి ప్రజాదరణలోకి వస్తున్న తరుణంలో ప్రజలుకాస్త ఊపిరి పీల్చుకుంటున్న వేళ, ఒక్కసారిగా ప్రస్తుతం బర్డ్ ఫ్లూ అనేపేరు వినిపించి, దానికి సంబంధించిన వార్తలు వివిధ మాధ్యమాలలో చక్కెర్లు కొడుతుంటే ప్రజలు తీవ్రఆందోళనకు గురి అవుతున్నారు.

హిమాచల్ ప్రదేశ్, కేరళ, మధ్యప్రదేశ్, రాజస్థాన్ ఇలాంటి 9 ఉత్తరాది రాష్ట్రాలలో బర్డ్ ఫ్లూ కొనసాగుతున్నట్లు అధికారులు ధృవీకరించారు. ఇప్పటికే లక్షలాది పక్షులు మృత్యువాత పడినట్లు నిపుణులు పేర్కొంటున్నారు. మహారాష్ట్రలోని ముంబాయి, తానే, ధాపోలీ, పర్భానీ తదితర జిల్లాలలో, ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని పౌరిగడ్ వార్ జిల్లా సితాబ్ పూర్ లో ఎన్నోకాకులు మృతిచెందుతున్నాయని నిర్దారణయ్యింది. హర్యానా రాష్ట్రంలోని పంచకుల జిల్లాలో 5 పౌల్ట్రీలకు చెందిన 1.66 లక్షల కోళ్లను నిర్మూలించే ప్రక్రియ చేపట్టారు. గుజరాత్ రాష్ట్రంలోని సూరత్, రాజస్థాన్ రాష్ట్రంలోని సిరిహి జిల్లాలలో బర్డ్ ఫ్లూ ఉన్నట్లు నిర్ధారణ అయ్యింది. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని భూపాల్ లో వారంరోజుల్లో 2400 పక్షులు, 12000 బాతులు మరణించాయి.

తెలంగాణ రాష్ట్రంలో నిజామాబాద్ జిల్లాలోని వర్ని మండలం జలాల్ పూర్ లో ఎన్నోకోళ్లు మృత్యువాత పడ్డాయి. హయత్ నగర్ సమీపంలోని వింజాపూర్ లో 7000 కోళ్లు మృతిచెందగా మరోలక్ష కోళ్లకు బర్డ్ ఫ్లూ సోకినట్లు అనుమానం వ్యక్తంచేస్తున్నారు. ఇప్పటికే కేంద్రప్రభుత్వం దేశవ్యాప్తంగా రాష్ట్రప్రభుత్వాలకు ప్రజలకు సోకకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. అలాగే కేంద్రప్రభుత్వం ఈ వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండటానికి ప్రత్యేక బృందాలను ఏర్పాటుచేసి కిల్లింగ్ యాక్షన్, రాపిడ్ యాక్షన్ లను రంగంలోకి దింపింది. అంటే దీనిప్రభావం ఎలా ఉండబోతుందో ముందుగానే తెలుస్తుంది.

చనిపోయిన పక్షులను పరీక్షగావించి ల్యాబ్ రిపోర్ట్స్ ఆధారంగా చూస్తే బర్డ్ ఫ్లూకు సంబంధించిన H5N1 వైరస్ ఉన్నట్లు నిర్ధారణ అయింది. చల్లని ప్రాంతంలో ఈవైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉంటూ, గాలిద్వారా వేగంగా వ్యాప్తి చెందుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ వైరస్ పక్షుల నుండి పక్షులకు వచ్చి, ఆ తరువాత పక్షుల నుండి మనుషులకు కూడా వ్యాప్తి చెందుతుందని గతంలో రుజువైన సంగతి తెలిసిందే. ఈ వైరస్ బారినపడితే మనుషులకు జలుబు, శ్వాసకోశ సమస్యలు, గొంతునొప్పి, కడుపునొప్పి లాంటి అనారోగ్య పరిస్థితులుఏర్పడి, అలసత్వం పాటిస్తే ప్రాణాలకేముప్పు వాటిల్లుతుంది.

ఈ వైరస్ మొదటగా 1956లో ప్రపంచానికి పరిచయమైంది. 2000 నుండి దాని యొక్క ప్రాబల్యాన్ని పెంచుకుంటూ వస్తున్నది. 2003లో మనుషులకు కూడా సోకుతుందని నిర్ధారణయ్యింది. 2008లో దేశంలోని పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో మొదటిసారిగా ఈ వైరస్ బయటపడింది. అప్పటి నుండి ప్రతిఏటా తన ప్రభావాన్ని చాటుకుంటూ వస్తున్నది. కాబట్టి ఎప్పుడైతే ఈ వైరస్ బారినపడే పక్షులు మరణిస్తున్నాయో, నిజనిర్ధారణ చేసుకుని తగినచర్యలు తీసుకోవడానికి ప్రభుత్వాలు చొరవతీసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉన్నది.

bird flu

అందులో భాగంగానే ఇంట్లో, ఫారంలో, జంతు ప్రదర్శనశాలలో కోళ్ల పెంపకంపై దృష్టి కేంద్రీకరించి పరిశీలిస్తూ రావలసిన అవసరం ఎంతైనా ఉన్నది. నివారణ చర్యల్లో భాగంగా లక్షలసంఖ్యలో కోళ్లు, బాతులు, పావురాలని చంపాల్సి వస్తుంది. 5 నుండి 10 కిలోమీటర్ల దూరంలో గల పక్షులన్నింటినీ చంపివేసే కార్యక్రమం చేపట్టాలి. మరీ ముఖ్యంగా పౌల్ట్రీలలో పనిచేసేవారు ఎక్కువగా బారినపడే అవకాశం ఉంటుంది. కావున తగినజాగ్రత్తలు వహించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ఇంట్లో పెంచుకొనే పెంపుడు జంతువులు, కోళ్లు, బాతులు, పావురాలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ దూరాన్ని పాటించాలి.

కరోనా నేపథ్యంలో అలవాటు చేసిన భౌతికదూరం, మాస్కులు ధరించడం, సానిటేషన్ దైనందిక జీవితంలో శాశ్వతంగా ఉపయోగించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందనడంలో ఎలాంటి అతిశయోక్తిలేదు. ప్రస్తుతం రాష్ట్రంలో ప్రభుత్వం ఎలాంటి ముప్పు లేదని ప్రకటనలు ఇస్తున్న, ప్రజానీకం మాత్రం తగిన జాగ్రత్తలు వహించకతప్పదు. “ చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే ఎలాంటి ప్రయోజనం చేకూరదు” కావున ఎవ్వరి ఆరోగ్యాలను వారు కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనాఉన్నది. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు సైతం ఎప్పటికప్పుడు వాస్తవ పరిస్థితిని పరిశీలిస్తూ, ముందస్తుగా జాగ్రత్తలు తీసుకోవడంలో భాగంగా అప్రమత్తమై ప్రజల ఆరోగ్యాలను కాపాడేచర్యలకు పూనుకోవాలి.

ముఖ్యంగా ప్రతిసారి కోడిమాంసానికి సంబంధించిన చర్చ జరుగుతూ వస్తున్నది. కరోనా సమయంలో ఒక్కసారిగా అమాంతం ధరలు పడిపోయి లక్షలాది కోళ్లను సజీవదహనం చేసిన విషయం తెలిసిందే. ప్రభుత్వం కల్పించుకొని సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి దానివల్ల ఎలాంటి హాని చేకూరదని ప్రకటనలు ఇచ్చిన కొంత కాలానికి వాటితో వ్యాపారం చేసేవారికి, దానిపై ఆధారపడి జీవించే వారికి మార్గం సుగమమైంది. ప్రస్తుత పరిస్థితుల్లో సైతం అదే అంశం చర్చకు దారితీసి వివిధ మాధ్యమాలలో చక్కర్లు కొడుతుంది. ఈ విషయంలో ప్రభుత్వము వైద్యనిపుణులచే చర్చించి, వాస్తవిక సమాచారాన్ని ప్రజలకు తెలియజేస్తూ ఆచర్చకు ముగింపు పలకాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉన్నది.

ఏది ఏమైనా ప్రస్తుత సమాజంలో ఎప్పుడు, ఎలా ముప్పు వాటిల్లుతుందని తెలియకుండా సమాజాన్ని భయాందోళనలకు గురిచేస్తుందన్న మాట వాస్తవం. కావున శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ఇలాంటి విపత్కర పరిస్థితులు దాపురించడానికి గల కారణాలను తెలుసుకొని, శాశ్వత పరిష్కార మార్గాలను అన్వేషిస్తూ, ప్రణాళికాయుతంగా అమలు పరుస్తూ, భవిష్యత్ తరాలకు భరోసా కల్పించాల్సిన బాధ్యత కేవలం రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలపైననే ఉన్నది. అన్ని అనుకున్నట్లు జరగాలని ఆశిద్దాం.