కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ ఎంపీ బండారు దత్తాత్రేయ ఒక్కగానొక్క కుమారుడు వైష్ణవ్ (21) గుండెపోటుతో మృతి చెందాడు. మంగళవారం హైదరాబాద్‌లోని తన స్వగృహంలో రాత్రి 10.45కు భోజనం చేస్తుండగా ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. హుటాహుటిన ముషీరాబాద్‌లోని గురునానక్ కేర్ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ వైష్ణవ్ 12.30 గంటలకు మృతిచెందినట్లు వైద్యులు ప్రకటించారు. వైష్ణవ్ ఎంబీబీఎస్ మూడో సంవత్సరం చదువుతున్నాడు. ఈ ఘటనతో దత్తాత్రేయ కుటుంబంలో విషాదం నెలకొంది.
ఆయన కుటుంబ సభ్యులు ఆసుపత్రిలో కన్నీరుమున్నీరుగా విలపించారు. వారిని ఓదార్చడం అక్కడున్న వారి తరం కాలేదు. ఇంత చిన్న వయసులో తమను వదిలి వెళతాడని కలలో కూడా ఊహించలేదని దత్తాత్రేయ కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. నగర మేయర్ బొంతు రామ్మోహన్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ముషీరాబాద్ ఎమ్మెల్యే లక్ష్మణ్, టీఆర్‌ఎన్ నాయకులు కార్పోరేటర్ శ్రీనివాస్‌రెడ్డి ఆస్పత్రికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించి, వైష్ణవ్ మృతి పట్ల సానుభూతి తెలిపారు.