
ఎన్ని సంఘటనలు జరిగినా మనిషి మారడం లేదు. చదువుకున్న వాళ్లు కూడా మూఢ నమ్మకాలను విశ్వసిస్తున్నారు.
వివాహితపై జ్యోతిష్యుడు అత్యాచారానికి పాల్పడటమే ఇందుకు తాజా ఉదాహరణ. వివరాల్లోకి వెళితే…
పూజల పేరుతో వివాహితపై ఓ జ్యోతిష్యుడు అత్యాచారానికి పాల్పడిన ఘటన బీహార్ లోని చంపారన్ జిల్లాలో వెలుగు చూసింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. స్థానిక రవిదాస్ పూర్ కు చెందిన స్వాతి (పేరు మార్చారు)కి రాము (పేరు మార్చారు)తో నాలుగేళ్ల క్రితం వివాహమైంది. వారికి సంతానం కలగలేదు.
స్థానిక పరిశ్రమలో డ్రైవర్‌గా పని చేస్తున్న రాము ఆర్థిక ఇబ్బందులతో రూ.5 లక్షల వరకు అప్పులు చేశాడు. అంతేకాదు నాలుగేళ్లయినా పిల్లలు కలగడం లేదని కుటుంబ సభ్యుల నుంచి ఆ దంపతులపై ఒత్తిడి పెరిగింది.
దీంతో ఏం చేయాలో తోచక తన స్నేహితుడు హరిదాస్ సహాయంతో ఓ జ్యోతిష్యుడిని (59) రాము సంప్రదించాడు. తన ఇబ్బందుల గురించి చెప్పాడు.
దంపతులు ఇరువురు వచ్చి కలవాలని ఆ జ్యోతిష్యుడు చెప్పాడు.
ఆ దంపతులు జ్యోతిష్యుని వద్దకు వెళ్లారు. అయితే రాము భార్యపై కన్నేసిన ఆ జ్యోతిష్యుడు కొన్ని పూజలు చేస్తే ఇబ్బందులు పోతాయని నమ్మించాడు.
గత వారంలో ఓ రోజు అర్ధరాత్రి ఆ దంపతుల ఇంటి కెళ్లిన జ్యోతిష్యుడు కష్టాలు తీరేందుకు పూజలు చేద్దామని చెప్పాడు.
స్వాతి భర్తను స్మశానం వెళ్లి మట్టి తీసుకురమ్మని జ్యోతిష్యుడు ఆదేశించాడు. రాము వెంటనే అక్కడి నుంచి స్మశానం వెళ్లి పోయాడు. తర్వాత స్వాతిని నగ్నంగా మారమన్నాడు.
అందుకు ఆమె అంగీకరించలేదు. దీంతో ఆమెను బంధించి బాధితురాలిపై అత్యాచారానికి పాల్పడ్డాడు.
ఎవరికైనా చెప్తే చనిపోతావని భయపెట్టాడు. ఆమె భర్త ఇంటికి వచ్చాక దెయ్యం పోగొట్టేందుకు మరోసారి తాను వస్తానని రాముకు చెప్పి వెళ్లిపోయాడు.
అయితే స్వాతి మాత్రం తనపై జరిగిన అత్యాచారాన్ని సహించలేక పోయింది.
తన సోదరుడి సహాయంతో పోలీసులను ఆశ్రయించగా కేసు నమోదు చేసుకుని నిందితుడైన జ్యోతిష్యుడిని అదుపులోకి తీసుకున్నారు. కేసు విచారణలో ఉంది.