సాగు చట్టాలను వ్యతిరేకిస్తూ దేశ రాజధాని ఢిల్లీలో రైతు నిరసనలపై విపక్షాలు విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షా తన ట్విట్టర్ ఖాతాలో ఘాటుగా స్పందించారు. భారత్ లో రైతుల ఆందోళనలపై విదేశీ మీడియాతో పాటు ప్రముఖులు కామెంట్లు చేస్తుండటంపై షా మండిపడ్డారు. ముఖ్యంగా పాప్ స్టార్ రిహన్నా ఓ ట్వీట్ చేశారు. దీంతో ఆమెకున్న 10 కోట్ల మంది ఫాలోవర్స్ ద్వారా ఆ ట్వీట్ వైరల్ అయింది.
భారత దేశ ఐక్యతను ఏ ప్రచారమూ భంగపరచలేదని పేర్కొన్నారు. దేశ తలరాతను ప్రచారాలు నిర్ధారించలేవన్నారు. కేవలం అభివృద్ధి మాత్రమే నిర్ధారిస్తుందని చెప్పారు. అభివృద్ధి లక్ష్యాన్ని సాధించేందుకు భారతావని కలసికట్టుగా ముందుకు సాగుతొందన్నారు. ఇప్పటికే ఈ ప్రచారంపై కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, ఎస్ జై శంకర్ లతో పాటు విరాట్ కోహ్లీ వంటి వారు ఇది తప్పుడు ప్రచారమని, దేశ ఐక్యతను దెబ్బతీసే ప్రయత్నమని వ్యాఖ్యానించారు.