తెలుగు రాష్ట్రాల్లో పుట్టి.. తెలుగువారయి ఉండి.. తెలుగులో పట్టుమని పది మాటలు కూడా మాట్లాడటం రాని వారు కోకొల్లలుగా ఉన్నారు. అలాంటిది ఎక్కడో అమెరికాలో పుట్టి పెరిగి.. ఉపాధి కోసం ఏపీలోని విశాఖపట్టణానికి వచ్చి.. ఒకే ఒక్క ఏడాదిలో తెలుగు నేర్చుకున్నాడో అమెరికన్. తెలుగంటే నాకు ఇష్టమని చెబుతూనే.. సహోద్యోగులతో మాట్లాడుతూనే తెలుగు నేర్చుకున్నానంటున్నాడు.
ఐస్ క్రీమ్ షాపులో పనిచేసే ఇతడితో ఓ వ్యక్తి అతడి తెలుగుకు ముగ్ధుడయిపోయి.. వీడియో తీసి ఫేస్‌బుక్‌లో పెట్టాడు.. అది కాస్తా వైరల్‌గా మారింది. పెట్టిన కొద్ది రోజుల్లోనే దాదాపు 3లక్షల వ్యూస్ వచ్చాయి. అతడిని ప్రశంసిస్తూ వేలాది కామెంట్స్ వచ్చాయి.
అమెరికాలోని మోంటానా పరిధిలో ఓ తెలుగు ఎన్నారై జాబ్ చేస్తున్నాడు. అనుకోకుండా ఓ రోజు తన స్నేహితులతో కలిసి దగ్గరలోని హేగన్ డాజ్ ఐస్క్రీమ్ షాపునకు తన వెళ్లాడు. ఐస్‌క్రీమ్ ఆర్డర్ ఇచ్చి.. తన స్నేహితుడితో పిచ్చాపాటీగా తెలుగులోనే మాట్లాడుకుంటున్నాడు. ఆర్డర్ వచ్చిన తర్వాత ‘సర్… మీ ఆర్డర్ వచ్చింది.. తీసుకోండి..’ అని ఆ షాపులోని ఓ అమెరికన్ అనడంతో వాళ్లు అవాక్కయ్యారు. మీకు తెలుగు తెలుసా..? ఎలా నేర్చుకున్నారు..? మీది అమెరికాయేనా..? తెలుగు రాష్ట్రాల్లో మీకు తెలిసిన వారు ఎవరైనా ఉన్నారా..? అంటూ ప్రశ్నలతో ముంచెత్తారు. వారు అడిగిన ప్రశ్నలన్నింటికీ ఆ అమెరిన్ ఓపిగ్గా తెలుగులోనే సమాధానమిచ్చి.. వారిని అబ్బురపరిచాడు. అయితే ఈ సంభాషణను ఆ ఎన్నారై వీడియో తీసి.. ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశాడు.. ‘ఎక్కడో విదేశాల్లో ఉన్న ఒక విదేశీయునికి తెలిసింది తెలుగు భాష యొక్క గొప్పతనం… తెలుగు మర్చిపోకూడదు. అది చాలా మంచి భాష అని ఒక విదేశీయుడికి అర్థం అయ్యింది కాని మన తెలుగు వాళ్ళకు అర్థం కావడం లేదు… దేశ భాషలందు తెలుగు లెస్స..’ అంటూ పోస్ట్ చేశాడు.
ఇంతకీ ఆ అమెరికన్ ఎవరా..? అని అని ఆశ్చర్యపోతున్నారా..? అతడి పేరు రిచర్డ్స్.. అమెరికాలోని మోంటానాలోని హేగన్ డాజ్ ఐస్‌క్రీమ్ షాపులో పనిచేస్తున్నాడు. తాను రెండేళ్ల పాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఉన్నాననీ.. తన ఉద్యోగనిమిత్తం అక్కడకు వెళ్లానని రిచర్డ్స్ చెప్పుకొచ్చాడు.
‘నేను మొదట విశాఖపట్టణానికి వెళ్లాను. ఆ తర్వాత విజయవాడ, హైదరాబాద్ నగరాలకు కూడా వెళ్లాను. మొదట్లో తెలుగు రాక నేను చాలా ఇబ్బంది పడ్డాను. అదే ప్రాంతానికి చెందిన నా సహోద్యోగులు నాకు తెలుగు నేర్పించారు. వాళ్లతో మాట్లాడుతూనే నేను తెలుగు నేర్చుకున్నా.. కస్టమర్లతో కూడా నేను తెలుగులోనే మాట్లాడేవాడిని.. అక్కడి వాతావరణం నాకు బాగా నచ్చింది. రెండేళ్ల తర్వాత అమెరికాకు తిరిగొచ్చేశా.
ఓ రోజు నేను పనిచేస్తున్న ఐస్‌క్రీమ్ షాపు వద్ద కొందరు తెలుగులో మాట్లాడటం కనిపించింది. నేను వారితో తెలుగులోనే మాటలు కలిపాను. వాళ్లు నేను తెలుగు మాట్లాడటం చూసి ఆశ్చర్యపోయారు. వారు ఎందుకు అంత ఆశ్చర్యపోయారు..? అన్నది నాకు మొదట్లో అర్థం కాలేదు. నేను వారితో మాట్లాడుతుంటే.. ఒకరు వీడియో తీశారు. వీడియో దేనికా..? అని కూడా అనుకున్నాను. కానీ ఆ తర్వాత కొద్ది రోజులకు తెలిసింది. అతడు దాన్ని ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేయడం.. అది కాస్తా వైరల్ అవడం జరిగింది. నేను ఆ రెస్పాన్స్ చూసి షాకయ్యా.. అప్పుడే ఓ నిర్ణయానికి వచ్చా.. నేను తెలుగు ఎలా నేర్చుకున్నానో తెలుగులోనే వీడియోలు చేసి.. నా ఫేస్‌బుక్ పేజీలో పెట్టాలనుకుంటున్నా.. నన్ను చూసి కొందరైనా తెలుగు నేర్చుకుంటే అదే నాకు సంతృప్తి..’ అని రిచర్డ్స్ తన ఫేస్‌బుక్ వీడియోలో తెలిపాడు.