కల్తీ.. కల్తీ.. కల్తీ.. పంచభూతాలను ఇప్పటికే కల్తీ చేసేశారు. ప్రతిదీ కల్తీనే అని అందరూ అంటుంటే.. అవునా ఆశ్చర్యం వేస్తోంది. ఇప్పుడు గోధుమ పిండి కూడా కల్తీ చేస్తున్నారు అని తెలియగానే మామూలు ప్రజలు షాక్ అయితే.. షుగర్ పేషంట్లు మాత్రం గుండెలు పట్టుకున్నారు. రాత్రి అయితే చాలు నాలుగు రొట్టెలు తినేసి పడుకుంటారు. అంత ఎందుకు అండీ.. గతంలో కిలో, రెండు కిలోలు గోధుమ పిండి ప్రతి ఇంట్లో సరిపోయేది. ఇప్పుడు నెలకు కనీసం 10 కిలోలు గోధుమ పిండి అవసరం అవుతుంది. షుగర్ ఉన్నోళ్లు.. రాకుండా జాగ్రత్త తీసుకునే వారు అందరూ కూడా గోధుమ పిండి చపాతీలనే ఆహారంగా తీసుకుంటున్నారు. దీంతో కొన్ని ఏళ్లుగా వేల క్వింటాళ్ల డిమాండ్ పెరుగుతూ వస్తోంది. హైదరాబాద్ లో దొరికిన కల్తీ గోధుమ పిండి.. దేశ వ్యాప్తంగా కలకలం రేపుతోంది. సంచలనం అయ్యింది. ఆశీర్వాద్ బ్రాండ్ పేరుతో కల్తీ గోధుమ పిండిని తయారు చేస్తున్నారు.
కల్తీ గోధుమ పిండి తయారీ విధానం :
రేషన్ దుకాణాల్లో దొరికే రూపాయి బియ్యంతోపాటు.. మార్కెట్ లో దొరికే నూక, తక్కువ నాణ్యత ఉన్న బియ్యం సేకరిస్తారు. దీన్ని పిండి చేస్తారు. అదే సమయంలో గోధుమలను కూడా మరలో పిండి చేస్తారు. కిలో గోధుమ పిండిలో నాసిరకం బియ్యంతో వచ్చిన పిండిని కలుపుతారు. ఇది కిలో – అరకిలో రేషియోలో ఉంటుంది. ఇందులో కొద్దిగా మైదా కూడా కలుపుతారు. దీని వల్ల రొట్టెలు చేసే సమయంలో విరిగిపోకుండా ఉంటుంది. ఈ పిండిని కిలో, రెండు కిలోలు, 5 కిలోల ప్యాకింగ్ తయారు చేస్తారు. ఇప్పటికే గోధుమపిండిలో ప్రముఖ బ్రాండ్ గా వెలుగొందుతున్న ఆశీర్వాద్ కంపెనీ లోగోతోనే.. అదే ప్యాకింగ్ విధానంలో కల్తీ గోధుమ పిండిని మార్కెట్ లోకి తీసుకొస్తున్నారు. ఆశీర్వాద్ కిలో ప్యాకెట్ వివిధ కేటగిరీల్లో రూ.35 నుంచి రూ.50 వరకు ఉంటుంది. కల్తీది మాత్రం కిలో 25 రూపాయలకే షాపులకు వేస్తున్నారు. బస్తీలు, గ్రామాల్లో వీటిని ఎక్కువగా మార్కెట్ చేస్తున్నారు.
పోలీసులే షాక్ అయ్యారు :
మేడ్చల్ జిల్లా దేవరయంజాల్లోని ఓ గోదాంపై దాడి చేసిన సైబరాబాద్ SOT పోలీసులు.. 650 బస్తాల కల్తీ గోధుమ పిండిని బస్తాలు చూసి షాక్ అయ్యారు. రూ.30 లక్షల విలువ చేసే మిషనరీని సీజ్ చేశారు. కొన్ని రోజులుగా గుట్టు చప్పుడు కాకుండా మేడ్చల్ జిల్లాలోని శివారు ప్రాంతంలో ఈ బిజిసెన్ జోరుగా సాగుతోంది. కొనుగోలుదారులు ఒరిజినల్ ప్యాకెట్లను సరిచూసుకోవాలని సూచించారు.
Courtesy: By V6 news, Source link