లగేజ్ లేకపోతే టికెట్‌పై డిస్కౌంట్

244

ప్ర‌యాణ‌మ‌న్నాక ల‌గేజ్ త‌ప్ప‌నిసరిగా ఉంటుంది. అయితే త‌క్కువ ల‌గేజ్‌తో ప్ర‌యాణించే వారికి టిక్కెట్‌పై రాయితీ ఇస్తామ‌ని డైరెక్ట‌రేట్ జ‌న‌ర‌ల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) బంప‌ర్ ఆఫ‌ర్ ఇచ్చింది.

లగేజ్‌ లేకుండా ప్రయాణించేవారికి త్వరలో టికెట్ ధరల్లో రాయితీ కల్పించనున్నట్లు వెల్లడించింది.

ఇకపై చెక్‌ ఇన్‌ లగేజ్‌ లేకుండా కేవలం క్యాబిన్‌ బ్యాగులతో మాత్రమే ప్రయాణించేవారికి టికెట్లపై డిస్కౌంట్లు కల్పించనున్నారు.

దేశీయ విమాన సంస్థలకు డీజీసీఏ శుక్రవారం (ఫిబ్రవరి 26) ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.

ప్రస్తుత నిబంధనల ప్రకారం.. విమాన ప్రయాణికులు 7 కిలోల వరకు క్యాబిన్‌ బ్యాగేజ్‌, 15 కిలోల వరకు చెక్‌ఇన్‌ లగేజ్‌లను తీసుకెళ్లవచ్చు.

అంతకంటే ఎక్కువ లగేజ్‌ తీసుకెళ్లాలనుకునే వారికి అదనపు ఛార్జీలు విధిస్తున్నారు.

తాజా నిబంధనల ప్రకారం.. ఇకపై చెక్‌ఇన్‌ బ్యాగ్‌లు లేకుండా కేవలం క్యాబిన్‌ బ్యాగులతో మాత్రమే ప్రయాణించే వారికి విమానయాన సంస్థలు టికెట్ల ధరలో డిస్కౌంట్ ఇస్తారు.

ఈ డిస్కౌంట్లు పొందాలంటే.. ప్రయాణికులు టికెట్‌ బుక్‌ చేసుకునే సమయంలోనే తమ వెంట తీసుకెళ్లే బ్యాగ్ బరువు చెప్పాల్సి ఉంటుంది.

ఎయిర్‌లైన్‌ బ్యాగేజీ పాలసీ ప్రకారం.. విమానయాన సంస్థలు ప్రయాణికులకు ఉచిత బ్యాగేజ్‌ అలవెన్సెస్‌తో పాటు జీరో బ్యాగేజ్‌/ నో చెక్‌ఇన్‌ బ్యాగేజ్‌ ధరల స్కీంను అందించేలా అనుమతి ఇస్తున్నామ‌ని డీజీసీఏ పేర్కొంది.

ప్రయాణికులు టికెట్‌ బుక్‌ చేసుకునే సమయంలోనే ఈ టికెట్‌ ధరల స్కీం గురించి వారికి తెలియజేయాలని అధికారుల‌ను ఆదేశించింది.

వీటిని తప్పనిసరిగా టికెట్‌పై ప్రింట్‌ చేయాలని డీజీసీఏ పేర్కొంది.