దివంగత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు కుమార్తె సురభి వాణీదేవికి టీఆర్ఎస్ పార్టీ తరఫున ఎమ్మెల్సీ ఎన్నికలలో పోటీ చేసే అవకాశంఇచ్చిన సంగతి తెలిసిందే.
మహబూబ్‌నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ పట్టభద్రుల నియోజకవర్గ టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి గా సురభి వాణిదేవిని సీఎం కేసీఆర్ ప్రకటించడంపై కాంగ్రెస్ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు.
ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి స్పందిస్తూ.. పీవీ కుటుంబానికి కేసీఆర్ అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు.
ఓడిపోయే సీటు పీవీ కుమార్తెకు ఇచ్చారని దుయ్యబట్టారు. కేసీఆర్ కుట్రను పీవీ కుమార్తె తెలుసుకోవాలని సూచించారు.
కరీంనగర్ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ రాజకీయ లబ్ది కోసమే పీవీ కుమార్తెను ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటించారని ఆరోపించారు.
పీవీ నరసింహారావును గౌరవిస్తూ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థులు బరి నుంచి తప్పుకోవాలని మంత్రి తలసాని సూచిస్తున్నారని అన్నారు.
పీవీపై నిజంగా అభిమానం ఉంటే ఆయన కుమార్తెకు రాజ్యసభ సీటు కానీ, గవర్నర్ కోటా నుంచి ఎమ్మెల్సీ అవకాశం కానీ ఇవ్వాలని అన్నారు.
గెలవలేని స్థానంలో ఎమ్మెల్సీ అవకాశం ఇచ్చి ఆ కుటుంబాన్ని అవమానించే ప్రయత్నం చేయొద్దని పొన్నం హితవు పలికారు.