కరోనా లాక్‌డౌన్ సమయంలో మనిషి, మానవత్వ విలువలను గురించి తెలిసిందనిపించింది. కానీ ఇప్పటికీ మానవత్వం లేదని ఈ ఘటనతో తెలుస్తోంది.
ఒక ట్రాన్స్ జెండర్‌ను ప్రేమించి పెళ్లి చేసుకుని వరకట్నం కోసం వేధించిన ఘటన చూస్తే మనిషి ఎంతకు దిగజారిపోతున్నాడో అర్థమవుతోంది.
పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో ఈ ఘటన జరిగింది.
వివరాల్లోకి వెళితే..
ఏలూరుకు చెందిన తారక అలియాస్ పండు అనే యువకుడు ఫేస్ బుక్‌లో పరిచయమైన భూమి అనే ట్రాన్స్ జెండర్‌తో ప్రేమలో పడ్డాడు. ట్రాన్స్ జెండర్ అని తెలిసిన తర్వాత కూడా ప్రేమాయణం కొనసాగించాడు.
కొద్దిరోజులు ప్రేమించుకున్న తర్వాత ఇంట్లో వాళ్లను ఒప్పించి పెళ్ళి చేసుకున్నాడు. అతని గొప్ప మనసుకు హాట్సాఫ్ చెప్పాల్సిందే.
కానీ పెళ్లయిన కొద్ది రోజులకు భూమిని నువ్వు నాకు వద్దు అంటూ వేధించడం మొదలు పెట్టాడు. దీంతో భూమి పోలీసులను ఆశ్రయించింది.
తారక ఏలూరులోని సత్రంపాడుకు చెందిన వ్యక్తి. భూమి హైదరాబాద్‌లోని ఎల్‌బి నగర్ నివాసి. వీరిద్దరు గతేడాది (2020) జనవరిలో పెళ్లి చేసుకున్నారు.
కొద్ది కాలానికి వీరి మధ్య చిన్నపాటి వివాదం మొదలైంది. కుటుంబ సభ్యుల ఒత్తిడితో భూమితో ఉండేందుకు ఆ యువకుడు నిరాకరించాడు. అంతేకాకుండా అదనంగా కట్నం తేవాలంటూ వేధించసాగాడు.
దీంతో భూమి ఎల్‌బీనగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు తారకను అరెస్ట్ చేశారు.