టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఇంటిపై రాళ్లదాడి.. 43 మందికి రిమాండ్‌

219
Trs Mla house Warangal

ఉమ్మడి వరంగల్ జిల్లా పరకాల టీఆర్ఎస్ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ఇంటిపై రాళ్లదాడి కేసులో వరంగల్ జిల్లా కోర్టు ఈ నెల 15వ తేదీ వరకు రిమాండ్ విధించింది. వీరిలో బీజేపీ వరంగల్ అర్బన్ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మారెడ్డి, రూరల్ జిల్లా అధ్యక్షుడు కొండేటి శ్రీధర్ తదితరులు ఉన్నారు.

అయోధ్య రామాలయ నిర్మాణంపై ఎమ్మెల్యే అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ బీజేపీ కార్యకర్తలు ఆదివారం హన్మకొండలోని ఆయన ఇంటిపై దాడిచేశారు. ఈ ఘటనలో 57 మందిపై కేసులు నమోదు చేసిన పోలీసులు తొలుత కొండేటి శ్రీధర్ సహా 38 మందిని అరెస్ట్ చేశారు. అనంతరం పద్మారెడ్డితోపాటు ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు. వీరందరినీ నిన్న కోర్టులో హాజరు పరచగా 43 మందికి కోర్టు రిమాండ్ విధించింది.

కాగా, ఎమ్మెల్యే చల్లా ఇంటిపై బీజేపీ కార్యకర్తల దాడిని నిరసిస్తూ టీఆర్ఎస్ పార్టీ పరకాల పట్టణ బందుకు పిలుపునిచ్చింది. పరకాల, ఆత్మకూరులో టీఆర్ఎస్ నాయకులు ద్విచక్ర వాహన ర్యాలీలు నిర్వహించారు. దామెరలో బీజేపీ నేతల దిష్టిబొమ్మను దహనం చేశారు. గీసుకొండ మండలంలోని కోనాయమాకులలో రాస్తారోకో చేశారు.