ఏపీలో పంచాయతీ ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ఇవాళ శ్రీకాకుళం జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికలు పారదర్శకంగా జరగాలనే ఉద్దేశంతోనే జిల్లాలో పర్యటిస్తున్నానని అన్నారు. శ్రీకాకుళం జిల్లాలో ఎన్నికల ఏర్పాట్లు సంతృప్తికరంగా ఉన్నాయన్నారు. పలు జిల్లాల్లో ఏకగ్రీవాలు జరుగుతున్నట్టు వస్తున్న వార్తలపై ఆయన స్పందించారు. ఏకగ్రీవాలపై తమకు నిర్దిష్టమైన అభిప్రాయం ఉందని తెలిపారు. ఏకగ్రీవాలకు తాము పూర్తి వ్యతిరేకం కాదన్నారు.
శ్రీకాకుళం జిల్లాలో గతంలో 20 శాతం ఏకగ్రీవాలు జరిగాయని తెలిపారు. ఎన్నికల నిర్వహణ ఉద్యోగులకు సవాల్ గా మారిందన్నారు. తన 40 ఏళ్ల సర్వీసులో ఎప్పుడూ వివాదాస్పదం కాలేదని అన్నారు. రాజ్యాంగం ప్రకారం ఒక వ్యవస్థలోకి మరో వ్యవస్థ చొరబాటు కుదరదని స్పష్టం చేశారు. తమ విధుల్లో ఇతరులు జోక్యం చేసుకున్నారు గనుకనే కోర్టుకు వెళ్లామని వివరించారు.
ప్రతి వ్యవస్థకు రాజ్యాంగం నిర్దిష్టమైన విధులు కేటాయించిందని పేర్కొన్నారు. న్యాయ వ్యవస్థపై తమకు పూర్తి నమ్మకం ఉందని స్పష్టం చేశారు. బాధ్యతలు నిర్వర్తించేందుకే అధికారాలు ఇచ్చారని చెప్పారు. తన బాధ్యతలు తనకు తెలుసని, అందుకే స్వీయ నియంత్రణ పాటిస్తానని పేర్కొన్నారు.