పెట్రోల్‌ బంకులో చుక్క..చుక్క నొక్కేస్తున్నారు.. జర భద్రం

325

గ్రేటర్‌హైదరాబాద్‌లో పెట్రోల్‌ బంకుల యజమానులు రూట్‌ మార్చి మోసాలకు పాల్పడుతున్నారు, పెద్ద ఎత్తున ఒకేసారి కాకుండా ఒక లీటర్‌కు 5 నుంచి 10 మిల్లీ లీటర్లు తక్కువగా పోస్తూ రూపాయి రూపాయి వెనుకేసుకుంటున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇటీవల తూనికలు, కొలతల శాఖ అధికారుల దాడుల్లో బయట పడుతున్న విషయాలే దీనికి నిదర్శనం.

రాష్ట్ర తూనికలు కొలతల శాఖ కంట్రోలర్‌ సందీప్‌ కుమార్‌ సుల్తానియా ఆదేశాల మేరకు మూడు రోజులుగా గ్రేటర్‌ పరిదిలోని పెట్రోల్‌ బంకులపై తూనికలు, కొలతల శాఖ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. కొలతలలో తేడాలు వస్తున్న బంకులపైన కేసులు నమోదు చేస్తున్నారు. తనిఖీల్లో ఒక్కో నాజిల్‌ నుంచి 5 లీటర్ల పెట్రోల్‌ లేదా డీజిల్‌ను పరిశీలించగా 35 నుంచి 30 మిల్లీ లీటర్ల వరకు తక్కువగా వస్తున్నట్లు తెలుసుకున్నారు .

వరుసగా తనిఖీలు

హైదరాబాద్‌ జిల్లాలో 176, రంగారెడ్డి జిల్లా రీజియన్‌లో 375 పెట్రోల్‌ బంకులు ఉన్నాయి. కొన్ని రోజులుగా తూనికలు, కొలతల శాఖ అధికారులు స్థబ్ధుగా ఉండటంతో పెద్దగా కేసులు నమోదు కాలేదు. ఇటీవల జరిగిన సమావేశంలో ఆ శాఖ ఉన్నతాధికారులు గ్రేటర్‌లోని పెట్రోల్‌ బంకులపై ఫిర్యాదులు వస్తున్నందున తనిఖీలు చేపట్టి అక్రమాలకు పాల్పడుతున్న బంకుల నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. దీంతో ఈ నెల 25న హస్తినాపురంలోని ఇండియన్‌ పెట్రోల్‌ బంకులో లీటరుకు 6 మిల్లిలీటర్ల చొప్పున తక్కువగా వస్తున్నట్లు గుర్తించారు.