కర్ణాటక భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు బీఎస్ యడ్యూరప్ప అధికారాన్ని చేజిక్కించుకోవాలని తహతహలాడుతున్నారు. త్వరలో జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో తాము అనుకున్నట్టుగా బీజేపీ 22 స్థానాల్లో గెలిస్తే.. 24 గంటల్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ఇటీవల జరిగిన ఓ సభలో యడ్యూరప్ప ప్రకటించారు. ఈ విషయాన్ని తాను ఊరికే చెప్పడం లేదని.. తమ పార్టీ అధికారంలోకి వస్తే తప్పకుండా ఇప్పుడున్న ప్రభుత్వాన్ని పడగొట్టి.. బీజేపీ నేతృత్వంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామన్నారు యడ్యూరప్ప. 20 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు.. హెచ్‌డీ కుమారస్వామి సీఎంగా ఉండడాన్ని అంగీకరించడం లేదన్నారు. మొత్తం 28 లోక్‌సభ స్థానాలున్న కర్ణాటకలో ప్రస్తుతం బీజేపీ 16, కాంగ్రెస్ 9, జేడీఎస్ నుంచి ఇద్దరు ఎంపీలు పార్లమెంట్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
ప్రస్తుతం కర్ణాటకలో కాంగ్రెస్ – జేడీఎస్ కూటమి ప్రభుత్వం కొనసాగుతోన్న విషయం తెలిసిందే. బాలాకోట్‌లోని జైషే ఉగ్రవాద శిబిరాలపై దాడులు చేయడం బీజేపీకి అనుకూలంగా మారిందని.. దీంతో కర్ణాటకలో బీజేపీ 22 లోక్‌సభ స్థానాలను గెలుచుకుంటుందని యడ్యూరప్ప వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం విదితమే.