ఆర్టీసీలో సమ్మె సైరన్

488
tsrtc strike from 11

ఆర్టీసీలో సమ్మె సైరన్ మోగనుంది. ఈ మేరకు గుర్తింపు పొందిన సంస్థ టీఎంయూ సిద్ధమవుతోంది. గత నెల మే7న ప్రభుత్వానికి కార్మికులు సమ్మె సమ్మె నోటీస్ ఇచ్చారు. 2017 ఏప్రిల్ 1 నుంచి వేతన సవరణ చేయాలని కోరుతున్నారు. ఇప్పటికే పలుసార్లు కార్మిక సంఘాలు మంత్రుల కమిటీతో డిమాండ్లపై చర్చించాయి. కాగా నష్టాల్లో ఉన్న ఆర్టీసీని కాపాడాలంటే కొన్ని త్యాగాలు చేయాలని ప్రభుత్వం కోరింది. ఇది ఇలా ఉంటే కార్మికుల వల్లే ఆర్టీసీ నష్టాల్లో కూరుకుపోయిందని సీఎం కేసీఆర్ అనడంతో కార్మిక సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. సీఎం వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించాయి. నష్టాలకు ప్రభుత్వ నిర్ణయాలు, యాజమాన్యమే కారణమని మండిపడ్డాయి. నష్టాలకు తమను బాధ్యులను చేయడం సరికాదని పేర్కొన్నారు. కాగా వేతన సవరణపై ప్రభుత్వం నుంచి ఎలాంటి హామీ లభించకపోవడంతో సమ్మెకు వెళ్లాలని నిర్ణయించారు.



 

10వ తేదీ లోపు డిమాండ్లు నెరవేర్చాలి: టీఎంయూ
ఈ నెల 10వ తేదీలోపు తమ డిమాండ్లను నెరవేర్చకపోతే 11వ తేదీ నుంచి సమ్మెకు దిగుతామని గుర్తింపు పొందిన సంస్థ టీఎంయూ హెచ్చరించింది. ఈ మేరకు సోమవారం ఆర్టీసీ ఈడీ (అడ్మిన్) శివకుమార్‌కు నోటీస్ అందజేశారు. ఈ సందర్భంగా టీఎంయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అశ్వత్థామ రెడ్డి మాట్లాడుతూ వేతన సవరణ ఫిట్‌మెంట్ 50శాతం ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీనితోపాటు 72 సమస్యలను పరిష్కరించాలని కోరారు. సమ్మె సన్నాహాల్లో భాగంగా ఈ నెల 7న భోజన విరామ సమయంలో ఆర్టీసీ డిపోల ఎదుట ఎర్ర బ్యాడ్జీలతో నిరసన తెలపనున్నట్లు పేర్కొన్నారు. అదే విధంగా 8న రీజినల్ కార్యాలయాల ఎదుట సామూహిక నిరాహార దీక్షలకు దిగనున్నట్లు చెప్పారు. వేతనాలు పెంచకుండా యాజమాన్యం తాత్సారం చేయడం సరికాదన్నారు