కోమటిరెడ్డి, సంతప్ కుమార్ కు ఢిల్లీలో చేదు అనుభవం
తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డికి, పాలమూరు కాంగ్రెస్ నేత సంపత్ కుమార్ లకు ఢిల్లీలో షాక్ తగిలింది. కాంగ్రెస్ నేతలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్ లకు ఢిల్లీలోని తెలంగాణ భవన్ లో గదులు లేవని భవన్ అధికారులు తేల్చేశారు. అదేమంటే.. వారిద్దరికీ గదులు ఇవ్వరాదని తెలంగాణ సీఎం కార్యాలయం నుంచి ఫోన్లో ఆదేశాలు అందినట్లు చెబుతున్నారు. ఈ విషయాన్ని ఆ ఇద్దరు నేతలు మీడియాకు వెల్లడించారు. ఎందుకు గదులు లేవంటే.. వారిద్దరూ మాజీ ఎమ్మెల్యేలు కాబట్టి గదులు కేటాయించవద్దని తెలంగాణ సిఎం ఆఫీసు నుంచి వర్తమానం అందినట్లు వారు ఆరోపిస్తున్నారు. దీంతో ఢిల్లీలోని తెలంగాణ భవన్ అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్ కుమార్ వీరిద్దరూ సర్కారు లెక్కల ప్రకారం మాజీ ఎమ్మెల్యేలు. ఎందుకంటే వారిద్దరి సభ్యత్వాలను తెలంగాణ అసెంబ్లీలో తీర్మానం పాస్ రద్దు చేశారు. వారి సభ్యత్వ రద్దు విషయమై అసెంబ్లీ రాజపత్రం కూడా జారీ చేసింది. కేంద్ర ఎన్నికల సంఘానికి నల్లగొండ, అలంపూర్ అసెంబ్లీ స్థానాలు ఖాళీ అయ్యాయని, వాటికి ఎన్నికలు జరుపుకోవచ్చని సమాచారం చేరవేసింది. సో.. ఏ లెక్కన చూసినా వాళ్లిద్దరూ మాజీలే అయిపోయారు.
కానీ.. వారిద్దరూ తమ సభ్యత్వాల రద్దుపై రాజ్యంగబద్ధమైన వేదికల ద్వారా పోరాటం చేస్తున్నారు. ఇప్పటికే హైకోర్టులో కేసు వేశారు. కేంద్ర ఎన్నకల సంఘానికి ఫిర్యాదు చేశారు. తమ సభ్యత్వ రద్దుకు కారణమని చెబుతున్న అన్ని వీడియోలు ఇవ్వాలంటూ సమాచార హక్కు చట్టం ద్వారా అసెంబ్లీ కార్యదర్శికి దరఖాస్తు పెట్టుకున్నారు. ఈ పరిస్థితుల్లో తమ పదవులు మళ్లీ దక్కించుకోవాలన్న యావ ఉందో లేదో కానీ.. సర్కారు ఏకపక్ష చర్యను ప్రపంచానికి చాటుతామన్న కసితో వారు ప్రయత్నాలు చేస్తున్నారు.
ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్ ప్లీనరీ సమావేశాలు జరిగే వేళ వారిద్దరికీ తెలంగాణ సర్కారు రెండో షాక్ ఇచ్చింది. వారికి తెలంగాణ భవన్ లో గదులు కేటాయింపు చేయకపోవడంతో.. తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. మాజీ ఎమ్మెల్యేలు అయినా.. తెలంగాణ భవన్ లో గదులు ఇచ్చే సాంప్రదాయం ఉందని, దాన్న కూడా ఎందుకు కాలరాశారని వారు ఫైర్ అయ్యారు. ఇక ఎంత మొత్తుకున్నా.. అక్కడ గదులు ఇచ్చేందుకు నో అనడంతో వారు బయట ప్రయివేటు హోటల్ లో బస చేశారు. ముందుగా జానారెడ్డి గదిలో ఉందామనుకున్నారు కానీ.. సర్కారు వైఖరిని ప్రపంచానికి చాటి చెప్పాలన్న ఉద్దేశంతో బయట హోటల్ లో బస చేసినట్లు పార్టీ నేతలు చెబుతున్నారు.
మొత్తానికి కోమటిరెడ్డి, సంపత్ కుమార్ ఇద్దరికీ తెలంగాణ సర్కారు సభ్యత్వ రద్దుతో ఒక షాక్ ఇస్తే.. ఢిల్లీలో రెండో షాక్ ఇచ్చిందని రాజకీయ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది.