రాజ్యసభ సీట్ల కోసం టీడీపీ సీనియర్ నేతల మధ్య తీవ్ర పోటీ నెలకొంటోంది. పలువురు సీనియర్లు రాజ్యసభ సీట్లను దక్కించుకునేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. రాజ్యసభ ఎన్నికల నేపథ్యంలో మంత్రులు కళావెంట్రావు, యనమల, పార్టీ ముఖ్య నేతలతో అమరావతిలో ఆ పార్టీ అధినేత, సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. నేతలందరితో సమాలోచనలు జరిపి రెండు రాజ్యసభ స్థానాలకే పోటీ చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. రాజ్యసభకు పోటీ చేసే అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేయడానికి సోమవారం వరకు మాత్రమే గడువు ఉండడంతో అభ్యర్థుల ఎంపికపై ఉత్కంఠ నెలకొంది.
కాగా మరోసారి రాజ్యసభకు వెళ్లాలని టీడీపీ సీనియర్ నేత దేవెందర్ గౌడ్ ఉవ్విళ్లూరుతున్నారు. ఈ మేరకు తనకు మరోసారి రాజ్యసభ అవకాశం ఇవ్వాలంటూ పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబుకు ఆయన లేఖ రాశారు. రాజ్యసభకు ప్రజల నుంచి వచ్చిన వ్యక్తినే ఎన్నుకోవాలని చంద్రబాబును కోరారు. దేశ ప్రజల భవిష్యత్తును ప్రభావితం చేసే చట్టాల రూపకల్పనలో రాజ్యసభ సభ్యుల పాత్ర కీలకమైందని, అలాంటి సభకు ప్రజాశ్రేయస్సు కోసం పనిచేసేవారినే పంపాలని లేఖలో విన్నవించారు. జడ్పీ చైర్మన్‌గా, మూడుసార్లు ఎమ్మెల్యేగా, పది సంవత్సరాలు కేబినెట్ మంత్రిగా, రాజ్యసభ సభ్యుడిగా తనకు పనిచేసే అవకాశం దక్కిందని సంతోషం వ్యక్తంచేశారు. ఇకముందు కూడా ప్రజాశ్రేయస్సు కోసం, ప్రజాస్వామ్య వ్యవస్థ బలోపేతానికి తన వంతు కృషి చేస్తానని ఆ లేఖలో దేవేందర్‌గౌడ్ పేర్కొన్నారు. దేవేందర్ గౌడ్ వినతిని చంద్రబాబు మన్నిస్తారా? లేదా? అన్నది విలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది.