నిర్మల్ జిల్లాలోని భైంసాలో మరోసారి ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇరువర్గాల మధ్య మరోసారి ఘర్షణలు చెలరేగాయి.
పట్టణంలోని బట్టి గళ్లీ ప్రాంతంలో జరిగిన చిన్న గొడవ పెను వివాదానికి కారణమైంది.
ఇరు వర్గాల మధ్య జరిగిన రాళ్ల దాడిలో చాలా మందికి గాయాలయ్యాయి. గాయపడ్డ వారిలో చిన్న పిల్లలు, మహిళలు కూడా ఉన్నారు. ఈ ఘర్షణలో ముగ్గురు పోలీసులకు గాయాలయ్యాయి.
పోలీసుల కథనం ప్రకారం.. జుల్ఫికర్ కాలనీలో రాత్రి ఏడున్నర గంటల సమయంలో కొందరు యువకులు సైలెన్సర్లు తొలగించిన బైకులపై పెద్ద శబ్దంతో కాలనీలో తిరిగారు.
ఆ శబ్దాన్ని భరించలేని స్థానికులు వారిని నిలదీశారు. రైతులు, కూలీలు ఇళ్లకు వచ్చి నిద్రపోయే సమయమని, ఇంతటి శబ్దాలతో వారిని ఇబ్బంది పెట్టవద్దని యువకులకు సూచించారు.
ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య ప్రారంభమైన చిన్నపాటి ఘర్షణ పెద్దగా మారింది. పరస్పరం దాడులకు దారి తీసింది.
బట్టీగల్లీ, పంజేషా చౌక్, కోర్బగల్లీ, బస్టాండ్ సహా పలు ప్రాంతాలకు ఘర్షణలు వ్యాపించాయి.
ప్రత్యర్థి వర్గం జనావాసాలపైకి రాళ్ల దాడికి దిగడమే కాకుండా ఆటోలు, కారు, బైకులను తగలబెట్టారు.
కత్తులతో వీధుల్లో హల్‌చల్ చేశారు. ఓ కూరగాయల దుకాణాన్ని తగలబెట్టారు.కవరేజీకి వెళ్లిన మీడియాపైనా కత్తులతో దాడికి తెగబడ్డారు.
ఈ ఘటనలో ప్రముఖ పత్రికలకు చెందిన ముగ్గురు విలేకరులకు కూడా గాయాలయ్యాయి. పరిస్థితులు ఉద్రిక్తతంగా మారడంతో బైంసాలో భారీగా పోలీసులు బలగాలను మోహరించారు.