రైతులకు జీవిత బీమా 5 లక్షలు

358
5 lakh life-insurance to farmers

భారతదేశంలోనే ఎక్కడా లేని విధంగా, ఏ రాష్ట్రంలో ఎవరూ చేయని రీతిలో రైతులందరికీ 5 లక్షల రూపాయల జీవిత బీమా సౌకర్యం కల్పించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు ముఖ్య మంత్రి కె.చంద్రశేఖర్ రావు తెలిపారు. రైతులకు జీవిత బీమా పథకం రూపకల్పనపై ప్రగతి భవన్ లో సిఎం కేసీఆర్ శుక్రవారం సమీక్ష నిర్వహించారు. వ్యవసాయ, ఆర్థిక శాఖ అధికారులు, ఎల్‌ఐసీ ప్రతినిధులతో మాట్లాడి విధి విధానాలు ఖరారు చేశారు.



రైతులు ఒక్క రూపాయీ కట్టనవసరంలేదు

వ్యవసాయాభివృద్ది – రైతుల సంక్షేమం కోసం ఎకరానికి రూ.8వేల పెట్టుబడి, 24 గంటల ఉచిత విద్యుత్ సరఫరా లాంటి అనేక అద్వితీయ పథకాలు ప్రవేశ పెట్టిన తెలంగాణ ప్రభుత్వం.. రైతులకు జీవిత బీమా సౌకర్యంతో మరో వినూత్న పథకానికి శ్రీకారం చుట్టిందని తెలిపారు. ఈ ఏడాది ఆగస్టు 15న రైతులకు జీవిత బీమా పథకం ప్రారంభించి, రైతులకు బీమా సర్టిఫికెట్లు అందిస్తామని వెల్లడించారు. రైతులు ఒక్క రూపాయి కూడా ప్రీమియం కట్టాల్సిన అవసరం లేకుండా, ఎంత వ్యయమైనా సరే ప్రభుత్వమే మొత్తం ప్రీమియం చెల్లిస్తుందని వెల్లడించారు. రైతులకు జీవిత బీమా పథకానికి చెల్లించడానికయ్యే నిధులను బడ్జెట్లోనే కేటాయించి, ఏటా ఆగస్టు ఒకటో తేదీన చెల్లిస్తామని వెల్లడించారు. లైఫ్ ఇన్సూరెన్సు కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్.ఐ.సి.) ద్వారా ఈ బీమా పథకం అమలు చేయనున్నట్లు ప్రకటించారు.

ఆగస్టు 15న రైతు బీమా పథకం ప్రారంభం..

రైతు ఏ కారణంతో మరణించాడనే విషయంతో సంబంధం లేకుండా, సాధారణ మరణాలతో సహా రైతు ఎలా మరణించినా.. ఆయన ప్రతిపాదించిన నామినీకి పది రోజుల్లోగా రూ.5 లక్షలు ప్రమాద బీమా చెల్లించే విధంగా పథకం ఉంటుందని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. కేవలం ప్రమాద బీమా మాత్రమే అయితే, ప్రభుత్వంపై వ్యయభారం కూడా తక్కువయ్యేదని, కానీ ఎంత వ్యయానికోర్చయినా సరే.. మరణించిన ప్రతీ రైతు కుటుంబాన్ని ఆదుకోవడం బాధ్యతగా భావించి జీవిత బీమా చేయాలని నిర్ణయించినట్లు సీఎం వెల్లడించారు. ఇంత పెద్ద మొత్తంలో జీవితబీమా చేస్తున్నందున ఎల్‌ఐసీ కూడా దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుని అమలు చేయాలని కేసీఆర్ కోరారు.


సమావేశంలో వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస రెడ్డి, ప్రభుత్వ సలహాదారు రాజీవ్ శర్మ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.కె.జోషి, రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు గుత్తా సుఖేందర్ రెడ్డి, ఎంపి వినోద్, మిషన్ భగీరథ వైస్ చైర్మన్ వేముల ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్ రావు, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకష్ణ రావు, వ్యవసాయ శాఖ కమిషనర్ జగన్మోహన్ రావు, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ రఘునందన్ రావు, ఎల్‌ఐసీ ఆర్‌ఎం. ఆర్.చందర్, డిఎం బిఎస్ నర్సింహ, డిఎం సుబ్రహ్మణ్యం, బిఎం జి.పట్నాయక్ తదితరులు పాల్గొన్నారు. 27వ తేదీన మధ్యాహ్నం రెండు గంటలకు ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం జరుగనుంది. ఈ సమావేశంలో తెలంగాణలో కొత్తగా ఏర్పాటు చేయనున్న జోన్లు, మల్టీ జోన్లు, రైతులకు జీవితబీమా పథకం తదితర అంశాలపై చర్చించనున్నారు.

తెలంగాణలో చిన్న, సన్నకారు రైతులే 93 శాతం మంది ఉన్నారు. ఒక్క ఎకరంలోపు ఉన్న వారు 18 లక్షల మంది ఉన్నారు. వారికి భూమి తప్ప మరో జీవనాధారం లేదు. ఏదేని పరిస్థితుల్లో రైతు చనిపోతే ఆ కుటుంబం ఒక్కసారిగా ఇబ్బుందుల్లో పడుతుంది. రైతుల కుటుంబాలను ఈ బాధ నుంచి తప్పించడానికి జీవితబీమా కల్పించాలని నిర్ణయించాం. మరణించిన రైతు కుటుంబానికి రూ.5లక్షల బీమా ఉంటే, ఆ కుటుంబానికి ఆసరా ఉంటుంది. ఇది తెలంగాణ ప్రభుత్వం రైతు సంక్షేమం కోసం వేస్తున్న మరో ముందడుగు అని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు.