ఒక పాప… ముగ్గురు తండ్రులు..!!

223

కోల్ కత్తా నగరంలోని ఓ ఆస్పత్రిలో ఆదివారం ఓ విచిత్ర సంఘటన చోటుచేసుకుంది. అప్పుడే పుట్టిన ఆడబిడ్డకు ‘తండ్రిని నేనే’ అంటూ ముగ్గురు వ్యక్తులు ముందుకొచ్చారు. శిశువు తల్లికి తానే భర్తనని ముగ్గురూ ప్రకటించుకున్నారు. వివరాలు.. శనివారం రాత్రి ఓ గర్భిణీ (21) నగరంలోని ఐఆర్‌ఐఎస్‌ ఆస్పత్రిలో చేరారు. ఆమెతో పాటు ఒక పురుషుడు, ఒక మహిళ ఉన్నారు. ఆ మహిళను డెలివరీ కోసం ఆపరేషన్‌ థియేటర్‌లోకి తీసుకెళ్లారు. ఇంతవరకూ బాగానే ఉంది.

ఇంతలో ఓ వ్యక్తి ఆస్పత్రికి వచ్చి డెలివరీ కోసం వెళ్లిన మహిళ తన భార్య అని.. ఆమెను కలుసుకోవాలని చెప్పడంతో ఆశ్చర్యపోవడం సిబ్బంది వంతైంది. ఎందుకంటే, మహిళతో పాటు వచ్చిన వ్యక్తి… ఆమె భర్తగా చెప్పుకున్నాడు. ఆపరేషన్‌ ఫారంలో సంతకం కూడా చేశాడు. ఇదే విషయం రెండో వ్యక్తికి చెప్పారు. అంతేగాక, అతన్ని మహిళ కుటుంబ సభ్యుల వద్దకు తీసుకెళ్ళి విషయం చెప్పారు. ఇద్దరూ ఆమె భర్తలేనంటూ వారు సమాధానమివ్వడంతో సిబ్బం‍ది మరోమారు ఆశ్చర్యపోక తప్పలేదు. ఇద్దరు భర్తల మధ్య అసలు భర్తను నేనంటే నేనంటూ తన్నులాట మొదలైంది. పరిస్థితి గందరగోళంగా మారడంతో హాస్పిటల్ యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ లోపు ఆపరేషన్‌ థియేటర్‌లో ఉన్న మహిళ ఆడశిశువుకు జన్మనివ్వడం.. పోలీసులు ఎంట్రీ ఇవ్వడం జరిగిపోయాయి.

మ్యారేజ్‌ సర్టిఫికేట్‌ ఉన్నా..

పోలీసులు ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని.. విచారణ ప్రారంభించారు. ఆ మహిళతో వివాహం అయినట్లు ఆధారాలు చూపించమన్నారు. దాంతో రెండో వ్యక్తి ఇంటికి వెళ్లి మ్యారేజ్‌ సర్టిఫికేట్‌ తీసుకువచ్చి పోలీసులకు చూపించాడు. ఈ పరిణామంతో మొదటి వ్యక్తి దారిలోకి వచ్చాడు. తాను సదరు మహిళకు కేవలం స్నేహితుడినని తెలిపాడు. సమస్య పరిష్కారం అయ్యిందనుకొంటుండగా ఇంకో సమస్య వచ్చిపడింది. మహిళ తల్లి రెండో వ్యక్తిని తన అల్లుడిగా నిరాకరించింది. దాంతో పోలీసులు మహిళ స్పృహలోకి వస్తేనే ఈ సమస్య పరిష్కారం అవుతుందని భావించి ఎదురు చూడసాగారు. ఈ లోపు కొత్త సమస్య ఎదురైంది. ఇద్దరిలో ఎవరు అసలు భర్తో తెలియని తికమక వాతావరణంలో ఇంకో వ్యక్తి వచ్చి పుట్టిన బిడ్డకు తానే తండ్రినని చెప్పారు .

భర్తను కాదు.. తండ్రిని

ఈ సారి తలపట్టుకోవడం పోలీసుల వంతైంది. సదరు మహిళకు తాను భర్తను కాదని, పుట్టిన బిడ్డకు మాత్రం తండ్రిని తానేనని మూడో వ్యక్తి వాదులాట మొదలెట్టాడు. ఈ పంచాయతీ పోలీసులకు సవాల్‌గా మారింది. మహిళ స్టేట్‌మెంట్‌ను రికార్డ్‌ చేస్తే తప్ప ఈ డ్రామాకు శుభం కార్డు పడేలా కనిపించలేదు. ఈ లోపు మహిళకు స్పృహ రావడంతో.. ఆమె స్టేట్‌మెంట్‌ రికార్డు చేశారు. జరిగిన విషయాలన్నీ చెప్పారు. తన నిజమైన భర్త ఎవరో చెప్పాల్సిందిగా కోరారు. ఆమె ఏ మాత్రం కంగారు పడకుండా మ్యారేజ్‌ సర్టిఫికేట్‌తో వచ్చిన రెండో వ్యక్తే తనకు భర్త అని వెల్లడించింది. అతనే తన బిడ్డకు తండ్రి అని తేల్చింది.

అసలు విషయం ఏంటంటే..

మహిళ తల్లి రెండో వ్యక్తిని తన అల్లుడిగా అంగీకరించకపోవడం గురించి ప్రశ్నించారు పోలీసులు. అందుకు మహిళ సమాధానమిస్తూ.. ‘మా ఇద్దరికి ఓ క్లబ్‌లో పరిచయమైంది, ప్రేమించుకున్నాం. ఈ లోపు నేను గర్భవతిని అయ్యాను. పెళ్లి గురించి అడిగితే.. తప్పించుకోవాలని చూశాడు. దాంతో అతని మీద పోలీసులకు ఫిర్యాదు చేశాను. ఫలితంగా ఈ ఏడాది ఏప్రిల్‌లో పోలీసుల జోక్యంతో మా వివాహం జరిగింది. అయితే మా వివాహాన్ని రెండు కుటుంబాలు అంగీకరించలేదు. దాంతో మేం వారి నుంచి విడిపోయి వేరుగా ఉంటున్నాం. ఆ కోపంతో మా అమ్మ నా భర్తను అల్లుడిగా ఒప్పుకోలేదు’ అని తెలిపింది. చివరకు కథ ఇలా సుఖాంతం అయ్యింది.